అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని మాసాల ముందు వరకు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్దగా జోష్లో కనిపించలేదు. అయితే పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి అధిష్టానం టీపీసీసీ ప్రెసిడెంట్గా పగ్గాలు అప్పగించారు. ఈ సమయంలో తెలంగాణ (Telangana) కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు మొదలైన విషయం తెలిసిందే.. అదీగాక టీ కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి తమకే వస్తుందని ఆశపడ్డారు. వీరందరిని కాదని తమకంటే జూనియర్, అదీ పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వడంపై అసహనం సైతం వ్యక్తం చేశారు.
ఇవేవీ లెక్కచేయని రేవంత్ తనపని తాను చేసుకొంటూ వెళ్లారు.. ఈ క్రమంలో మెల్ల మెల్లగా పార్టీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎం అయ్యారు. సీనియర్లను మంత్రి పదవులతో అధిష్టానం సరిపుచ్చింది. అంతా సవ్యంగానే సాగుతున్నదనే అభిప్రాయం బలపడుతున్న తరుణంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komati Reddy Venkat Reddy) ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ ఫొటో చర్చనీయాంశమైంది.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన వెంకట్రెడ్డి.. కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం అనే ట్యాగ్ లైన్ పెట్టడం.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అనుమానాలకు తెరతీసింది. అదీగాక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్స్ విపరీతంగా కామెంట్స్ పెడుతోన్నారు.. ఈ ఫొటోలో సీఎం రేవంత్ రెడ్డి కనిపించట్లేదేంటబ్బా.. రేవంత్ రెడ్డిని సీఎంగా కూడా యాక్సెప్ట్ చేయడం లేదా? అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.. కాంగ్రెస్లో అప్పుడే గ్రూప్ పాలిటిక్స్ మొదలయ్యాయా అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు..
అయితే వెంకట్రెడ్డి తాజాగా మరొక ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘వేగమొకడు.. త్యాగమొకడు గతము మరువని గమనమే. ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే. ఒకరు గర్జన.. ఒకరు ఉప్పెన వెరసి ప్రళయాలే. సైగ ఒకరు.. సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే..’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో సలార్ మూవీ పాటతో రూపొందించిన వీడియోను ట్వీట్ చేశారు.
మరోవైపు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోస్టులపై కాంగ్రెస్ (Congress) శ్రేణులు మాత్రం.. రేవంత్ రెడ్డితో మీ స్నేహం ఇలాగే కొనసాగాలని మద్దతు తెలుపుతున్నారు. మొత్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడవకముందే వెంకట్రెడ్డి.. ఓ రోజు డిప్యూటీ సీఎంతో, మరో రోజు సీఎంతో ఉన్న పోస్టులు షేర్ చేయడం వెనుక మర్మమేంటనే చర్చ రాజకీయాల్లో జోరుగా మొదలైంది..