కాంగ్రెస్ సర్కార్(Congress Government) బీఆర్ఎస్(BRS)ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి(Ex Minister) కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అన్నారు. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యాభై రోజులపైనే అయిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని సీఎం ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ప్రధాని మోడీని కేసీఆర్ ప్రశ్నించినంతగా ఎవరూ ప్రశ్నించలేదని ఆయన గుర్తుచేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావులను బిల్లా రంగాలతో రేవంత్ పోల్చడం దారుణమన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడ్డ నేతలను హంతకులతో పోల్చడం సీఎం పోస్టులో ఉన్న వ్యక్తికి చెల్లుతుందా? అంటూ ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు రేవంత్ అంగీకరిస్తేనే రూ.9వేల కోట్లు కేంద్రం అప్పుగా ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదన్నారు.
వందరోజుల్లో గ్యారంటీల అమలని చెప్పి ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే అమలు చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క ఎన్నికలో కాంగ్రెస్ గెలవగానే బీఆర్ఎస్ చచ్చిపోయింది అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీలో వేసినట్లే అని సీఎం అనడం ఓటర్లను అవమానించడమేనని కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందని గుర్తుంచుకోవాలన్నారు.