బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిపై తనకు ఎలాంటి పిచ్చి ఆలోచనలు లేవని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బానిసలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో 88 స్థానాలు వచ్చాయని, ఈ సారి అంతకన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏపీపీఎస్సీ ద్వారా కేవలం 24 వేల ఉద్యోగ నియామకాలు మాత్రమే చేపట్టిందన్నారు. అందులో తెలంగాణ వాటా కేవలం పది వేలు మాత్రమేనన్నారు. అదే తమ ప్రభుత్వ హయాంలో తాము 1.34 లక్షల ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామన్నారు. మిగిలిన 90 వేల నియామకాలు పలు దశల్లో ఉన్నాయని చెప్పారు. వాళ్లు ఏడాదికి వేయి ఉద్యోగాలను భర్తీ చేస్తే తాము 13 వేలు ఇచ్చామని వెల్లడించారు.
30 మెడికల్ కాలేజీలు పెట్టిన బీఆర్‌ఎస్ ఎక్కడ.. మూడు కళాశాలలు పెట్టిన కాంగ్రెస్ ఎక్కడని ఆయన నిలదీశారు. టీఎస్పీఎస్సీలో చిన్న చిన్న లోపాలు వున్నాయన్నారు. వాటిని త్వరలోనే సరి చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్, తాగునీరు, వైద్యం, సాగునీరు ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో.. తమ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించాలని డిమాండ్ చేశారు.
అక్కడక్కడ ఎమ్మెల్యేలపై చిరు కోపం ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వంపై అందరికీ ధృడమైన విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసి ఇప్పటికి 60 రోజులైందన్నారు. బీ ఫారాల పంపిణీని కూడా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రచారంలో తాము అందరికన్నా ముందున్నామన్నారు. ఫలితాల్లోనూ అందరి కన్నా ముందే ఉంటామన్నారు.
40 స్థానాల్లో కాంగ్రెస్ కు అసలు అభ్యర్థులే లేరన్నారు. ఇక యుద్దానికి ముందే బీజేపీ నేతలు చేతులు ఎత్తేశారని విమర్శించారు. ఈసారి 110 చోట్ల బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోతారన్నారు. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ఏ మాత్రం పోటీ కాదన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు తమకు ఏ మాత్రం సరితూగరని విమర్శించారు.
కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ కోత నిజం కాదా అని నిలదీశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒకే పంట పరిమితి మేరకు కొనుగోళ్లు చేస్తారని.. వాళ్లు తమకు సుద్దులు చెబుతారా? అని విమర్శించారు. ఖమ్మంలో కాంగ్రెస్ కు నేతలు నిండుగా ఉన్నారని అన్నారు. కానీ వాళ్లకు ఒక్క సీటు మాత్రమే వచ్చిందని తెలిపారు.
తెలంగాణ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత దారుణమని ఆయన విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలంటూ విరుచుకు పడ్డారు. ముదిరాజ్‌లకు మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించామని మంత్రి గుర్తు చేశారు. కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.. ఇందులో రెండో వాదన లేదన్నారు.
- మరిన్ని Telugu news మరియు రాజకీయ వార్తలు ఇక్కడ చదవండి !