రాజకీయంగా నష్టమని తెలిసినా బీఆర్ఎస్(BRS) హయాంలో బీసీ బంధు, దళితబంధు లాంటి పథకాలను అమలు చేశామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో గురువారం జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పూలే బాటలో కేసీఆర్ నడిచారని తెలిపారు. కేసీఆర్(KCR) బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు. రాజకీయంగా రిస్క్ అని తెలిసినా వెనక్కి తగ్గకుండా బీసీబంధు, దళితబంధు లాంటి పథకాలను ప్రవేశపెట్టారని వెల్లడించారు. అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించామని గుర్తుచేశారు.
అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆరు స్థానాలు బీసీలకు ఇచ్చారన్నాని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను పిలిపించి బీసీ డిక్లరేషన్ పేరుతో హామీ ఇచ్చిందన్నారు. బీసీలకు రూ.లక్ష కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు.
ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే స్పీకర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారన్నారు. అవకాశాల కల్పన మన చేతుల్లోనే ఉంటుందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తెలంగాణ ప్రజలకు, ముస్లిం సోదరులకు కేటీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.