Telugu News » KTR : బీఆర్ఎస్ ఓడిపోతదని అనుకోలేదు… కేసీఆర్ సీఎంగా లేరని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు….!

KTR : బీఆర్ఎస్ ఓడిపోతదని అనుకోలేదు… కేసీఆర్ సీఎంగా లేరని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు….!

బీఆర్ఎస్ ఓడిపోతుందని తాము కలలో కూడా అనుకోలేదని గ్రామాల్లో అంటున్నారని తెలిపారు. పోతే తమ ఎమ్మెల్యే ఓడిపోతడేమో అని అనుకున్నామని, కానీ సీఎం దిగిపోతారని తాము అనుకోలేదని ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు.

by Ramu
KTR: Congress is a nickname for hypocritical ethics.. KTR's tweet is viral..!

బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR) సీఎంగా లేరనే విషయాన్పి ఇప్పటికి ఇంకా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని తాము కలలో కూడా అనుకోలేదని గ్రామాల్లో అంటున్నారని తెలిపారు. పోతే తమ ఎమ్మెల్యే ఓడిపోతడేమో అని అనుకున్నామని, కానీ సీఎం దిగిపోతారని తాము అనుకోలేదని ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు. అయ్యో గిట్లెట్ల జరిగిందనే భావన ప్రజల్లో ఉందన్నారు.

ktr key comments on ts assembly elections defeat

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఆదిలాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ…. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై నెల రోజులు అవుతోందన్నారు. ఈ నెల రోజుల్లోనే తమ శ్రేయోభిలాషులు, తమ పార్టీ నేతలు, కార్యకర్తలు పలు నియోజక వర్గాలకు, జిల్లాలకు వెళ్లిన సమయంలో తెలంగాణ భవన్ లో కలిసిన సమయంలో పలు విషయాలను వెల్లడించారని చెప్పారు.

ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభమైందన్నారు. 5.30 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యామని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్లు, కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆయా నేతలు చెప్పిన ప్రతి మాట నేరుగా ప్రజల నుంచి వస్తున్న గొంతుగా, అభిప్రాయంగా తాము భావిస్తున్నామన్నారు.

కేవలం 1.88శాతం, 5లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయామని వివరించారు. చిన్న లోటుపాట్లను సవరించుకుంటే బాగుండేదని తమ నేతలు చెప్పారన్నారు. తమపై ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేకపోయామన్నారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. పార్టీని ఇంకా దృడంగా చేసి ఉంటే బాగుండేదని, కార్యకర్తల్లో నిస్తేజం ఉండేది కాదని నిక్కచ్చిగా చెప్పారని వెల్లడించారు.

బీఆర్ఎస్ పదేండ్ల పాలన, చేసిన అభివృద్ధిని కండ్లకు కట్టినట్టుగా కనబడుతున్న వైనాన్ని తమ నేతలు ప్రస్తావించారన్నారు. అభివృద్ధి విషయంలో ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కరెంట్ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. ఆస్పత్రులు కట్టారని, పాలనా బాగా చేశారని ఎలాంటి కంప్లయింట్స్‌ లేవని చె్ప్పారన్నారు.

బీఆర్‌ఎస్‌ ఓడిపోతదని తాము అనుకోలేదని గ్రామాల్లో అంటున్నారని చెప్పారు. ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చ గురించి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు. గతంలో తీసుకువచ్చిన కొన్ని కార్యక్రమాలు, పెట్టిన పథకాల్లో పలు సవరణలు చేస్తే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వివరించారు.

అవతలి వాళ్లు అబద్దాలు చెప్పారని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము అనని మాటలను కూడా అన్నట్లుగా అసత్య ప్రచారాలు చేశారని, వాటిని తాము ఖండించలేదన్నారు. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టి కూడా ఆ విషయాన్ని సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. దుష్ప్రచారంతో చాలా వరకు ఓట్లు దూరమయ్యాయని స్పష్టం చేశారు. గతంలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ప్రజల్లో ఎలాంటి రెండో అభిప్రాయం లేదన్నారు. కేసీఆర్‌ సీఎంగా లేరని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఇలా జరుగుతుందని తాము అనుకోలేదని బీజేపీ, కాంగ్రెస్ లకు ఓట్లు వేసిన ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు.

ఈ సమావేశంలో ‘కాంగ్రెస్ 420 హామీలు’ పేరుతో ఓ బుక్ లెట్ ను బీఆర్ఎస్ విడుదల చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు గురించి గుర్తు చేసే ఉద్దేశంతో ఈ బుక్ లెట్ ను తీసుకు వచ్చింది. ఆరు గ్యారంటీలతో పాటు వివిధ డిక్లరేషన్లు అంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఈ బుక్ లెట్ లో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అములోకి రాకముందే ఆ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది.

You may also like

Leave a Comment