తెలంగాణ రాజకీయాలలో నేతల మాటలు లక్ష్మీ బాంబుల్లా పేలుతున్నాయని అనుకుంటున్నారు. గెలుపు ఓటముల మధ్య నలిగిపోతున్న రాజకీయ ప్రభుద్ధులు ఎన్నికల రిజల్ట్ వరకు ఇంకా ఎలా మారుతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని జనం గుసగుసలాడుతున్నారు. మరోవైపు మాటలు దాటి దాడుల వరకు చేరుకున్న రాజకీయాలలో.. ఏ క్షణం ఏం జరుగుతుందో అనేలా ఉత్కంఠంగా మారాయి.
ఇక నాగర్కర్నూల్ (Nagar Kurnool)జిల్లా, అచ్చంపేటలో (Acchampet) బీఆర్ఎస్, కాంగ్రెస్ (Congress) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ ఎమ్మెల్యే బాలరాజు (Guvvala Balaraju)ను మంత్రి కేటీఆర్ (KTR) పరామర్శించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. గువ్వల బాలరాజుపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని.. ఇవాళ గువ్వల బాలరాజుపై రాళ్లతో దాడి చేయడం అమానుషమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే.. జరిగే నష్టాన్ని భరించేది మీరే అని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అని పేర్కొన్న కేటీఆర్.. గువ్వల బాలరాజుకు భద్రత పెంచాలని డీజిపిని కోరుతున్నట్టు వెల్లడించారు.