అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ (BRS) రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం కీలక నేతలు అందరూ పార్టీని వీడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ ఉనికిని చాటుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం క్యాంపు రాజకీయాలకు తెరతీశారని తెలుస్తోంది. జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గోవాకి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఉన్న నేతలు జారిపోకుండా చూసుకొనే బాధ్యతను నెత్తిన ఎత్తుకొన్న కేటీఆర్ (KTR).. ఉన్నవారినైనా పార్టీ మారకుండా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నట్లు తెలుస్తొంది. అందుకే ఎన్నికల రోజు ప్రత్యేక వాహానాల ద్వారా వీరందరినీ తెలంగాణ (Telangana)కు తరలించి ఓటింగ్ లో పాల్గొనేలా చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఇప్పటికే కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీని వీడి కాంగ్రెస్ (Congress)లో చేరిన విషయం తెలిసిందే..
మరోవైపు కవిత (Kavitha) అరెస్టుతో కేటీఆర్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే.. లోక్ సభ ఎన్నికలకు సమయం లేని తరుణంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండి పార్టీని పట్టించుకోకుండా ఢిల్లీకే పరిమితం అయ్యారని కేటీఆర్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఆ అపవాదు నుంచి బయటపడటానికి గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేటీఆర్ గోవా (Goa)లో సీక్రెట్ రాజకీయాలకు తెరతీశారని అనుకొంటున్నారు..
ఇదిలా ఉండగా.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 28 న ఉండటం.. పార్లమెంట్ ఎన్నికలకు కూడా సమయం లేకపోవడం వల్ల కేటీఆర్ స్పీడ్ పెంచారని అంటున్నారు.. అందుకే జిల్లాలోని స్ధానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో గోవాలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ మీటింగ్ లో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పార్టీలోని జిల్లాస్థాయి నేతలు కూడా పాల్గొన్నట్లు సమాచారం..
ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఈయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు.. అయితే కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉపఎన్నిక తధ్యం అయ్యింది. కాగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో.. సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని భావించుకున్న నేతలు, గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.