లోక్ సభ ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ (BRS).. కాంగ్రెస్ (Congress).. బీజేపీ (BJP).. ఇలా మూడు ప్రధాన పార్టీలు వ్యూహారచనలో ఉన్నారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలవబోతుందనే సంకేతాలు అందుతున్నాయి.. ఉడుంపట్టులా ఉన్న బీజేపీ.. పరువు కాపాడుకునే పనిలో బీఆర్ఎస్.. గత వైభవాన్ని పొందాలనే ఆరాటంలో కాంగ్రెస్.. ఇలా ఎవరికి వారే ఉద్దండులుగా మారుతున్నారని అంటున్నారు..
మరోవైపు ఊరించిన పదవి ఈసడించడంతో రామన్న పార్లమెంట్ ఎన్నికలపై గట్టిగానే ఫోకస్ పెట్టినారని అనుకొంటున్నారు.. ఈ క్రమంలో సన్నాహక సమావేశాల్లో మాటలకు పదును పెంచినాడనే టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో, నిజామాబాద్ (Nizamabad) లోక్సభ స్థానం సన్నాహక సమావేశంలో (LokSabha Meeting) పాల్గొన్న కేటీఆర్ (KTR).. నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం, ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిథ్యం ఉండాల్సిందేనని అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. బీఆర్ఎస్కు గెలుపు ఓటములు కొత్త కాదని గుర్తు చేశారు.పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలకు దెబ్బకొట్టేలా కుట్ర చేస్తే, బీఆర్ఎస్ తరపున కొట్లాడుదామని పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చిందని విమర్శించారు. పేద ప్రజల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. అదే జరిగితే ఆయా లబ్ధిదారులతో కలిసి తమ పార్టీ పోరాటం చేస్తుందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అస్తవస్త్య పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.