Telugu News » KTR : ఆ అడ్డంకులు ఇప్పుడు కనిపించడం లేదా…గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలు చూస్తున్నారు… !

KTR : ఆ అడ్డంకులు ఇప్పుడు కనిపించడం లేదా…గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలు చూస్తున్నారు… !

సీఎం రేవంత్ రెడ్డికి గవర్నర్‌ బాధ్యులు కాదని, కేవలం ప్రజలకు బాధ్యులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

by Ramu
ktr says telangana people observing governors attitude

గవర్నర్ (Governor) వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ (Telangana) ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ (KTR) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి గవర్నర్‌ బాధ్యులు కాదని, కేవలం ప్రజలకు బాధ్యులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్‌భవన్ నడుస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ktr says telangana people observing governors attitude

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను కేటీఆర్ ఎగురువేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ….
తెలంగాణ కోసం పోరాడిన దాసోజు శ్రావణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గతంలో తమ ప్రభుత్వం నామినేట్ చేసిందన్నారు. కానీ రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెబుతూ వారి అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారని చెప్పారు. మరి ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాం అభ్యర్థిత్వాన్ని ఎలా ఆమోదించారని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అనుకుంటే మరి కోదండరాంను ఎలా ఆమోదించాలో గవర్నర్ వివరించాలని డిమాండ్ చేశారు. నాడు కనిపించిన రాజకీయ నేపథ్య అడ్డంకులు కనిపించాయని మరి ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

కాంగ్రెస్, బీజేపీకి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా అనే విషయాన్ని వివరించాలన్నారు. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును తెలియజేస్తోందన్నారు. ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాల మీద ఎలా సంతకం చేశారో గవర్నర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైన విషయం ప్రజలందరికీ తెలుస్తోందన్నారు.

ఒకటే రోజు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు ఒకటే బులిటిన్ ద్వారా రాజీనామా ఆమోదించారని చెప్పారు. ఒకటే కోటా కింద ఉన్న ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించారని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవగానే ఒకే ఎన్నిక కాకుండా వేరువేరుగా ఎన్నికలు జరిగేటట్టు నిర్వహించారని పేర్కొన్నారు. ఒకేసారి ఎన్నిక జరిగితే వాటిలో ఒకటి బీఆర్ఎస్‌కు, మరొకటి కాంగ్రెస్‌కు వచ్చేదన్నారు.

జాకీలు పెట్టి మరి కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ కూడా మొన్న కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవద్దని… బీఆర్ఎస్‌ను అంతం చేద్దామని పిలుపునిచ్చారని… నిన్న గుంపు మేస్త్రి కూడా అదే మాట అన్నారని గుర్తుచేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మంచి పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన నీచ మానవులు తమ బుద్ధి మార్చుకోరని పెద్దలు ఎప్పుడో చెప్పారన్నారు.

రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్సే ఇప్పటికీ అధికారంలో ఉందనుకుని తమను ఆడిపోసుకుంటున్నారని విమర్శించారు. చేతనైతే ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలుపర్చాలని సూచించారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవన్నారు.

ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచుల పదవీకాలాన్ని పొడగించాలని కోరారు. అంతే కానీ ప్రత్యేక ఇంచార్జీలను పెట్టవద్దని సూచించారు. ప్రజాపాలన అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రమే పాలించాలని, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇంచార్జీలు కాదన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో సర్పంచ్‌లో రెండేండ్ల పాలనా సమయం పోయిందన్నారు. అందువల్ల పదవీ కాలాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరం వరకు పొడిగించాలని లేదా ఎన్నికలు నిర్వహించే వరకు వారి కాలాన్ని పొడిగించాలని సూచనలు చేశారు.

 

You may also like

Leave a Comment