రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కాదనీ.. కేవలం రాసింది మాత్రమే చదివే రీడర్ అంటూ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. 40 స్థానాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని ఆయన అన్నారు. అలాంటిది 70 స్థానాల్లో గెలుస్తామంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఎద్దేవా చేశారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం కొడంగల్ లో రేవంత్ రెడ్డికి రూ. 8 కోట్లు అందాయని ఆయన ఆరోపిచారు.
బీఆర్ఎస్ తరఫున సీఎం అభ్యర్థి కేసీఆర్ అని అన్నారు. మరి కాంగ్రెస్, బీజేపి పార్టీల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. గ్రేటర్లో కాంగ్రెస్ కు 20 స్థానాల్లో అసలు అభ్యర్థులే లేరని చెప్పారు. తాజాగా కాంగ్రెస్ కు ఆ పార్టీ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారని అన్నారు. బీఆర్ఎస్లోకి వస్తానని చెబితే పొన్నాల ఇంటికి తాము వెళతామన్నారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు రెడీ అన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ డిజిట్ కూడా దాటదన్నారు. 110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందన్నారు. కర్ణాటకలో ఈ రోజు రూ.42 కోట్లు పట్టుబడ్డాయన్నారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం కొడంగల్‌లో రూ. 8 కోట్లు రేవంత్ రెడ్డికి అందాయని ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలను అంగట్లో సరుకుల లాగా నోట్ల కట్టలతో కొనాలని కాంగ్రెస్ అనుకుంటోందన్నారు.
తమ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వమన్నారు. మైనార్టీలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. తమ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా మైనార్టీల కోసం పని చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 286 మైనార్టీ హాస్టల్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణలో బుల్డోజర్ కూల్చివేతలు లేవన్నారు. మిషనరీల పై దాడులు లేవన్నారు.జాతీయ రాజకీయాల్లో ప్రబల శక్తిగా తమ పార్టీ ఎదగాలని అనుకుంటోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌తో తమకెందుకని అన్నారు.
తమ పైనే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కాంగ్రెస్ నేతల మీద ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు?. ఓటుకు నోటు కేసును కేంద్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల సంఘం చేసిన బదిలీలను బదిలీలుగా మాత్రమే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కరోనా వల్ల నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయామని తెలిపారు.
తమ అభ్యర్థులు 114 మంది ప్రచారంలో దూసుకుపోతున్నట్టు చెప్పారు. మిగతా ఐదుగురు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌లో డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్య కాంగ్రెస్ నేత ఒకరు కలిశారన్నారు. కూకట్ పల్లి సీటు కోసం ఆయన దగ్గర రూ. 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట అని అన్నారు. .గతంలో తాను చేప్పినట్టే కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతోందన్నారు.
.అక్కడ చదరపు అడుగుకు 500 వసూల్ చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు తరలించేందుకు సిద్ఢంగా ఉన్న రూ. 42 కోట్లను కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికిందన్నారు. రూ. 8 కోట్లు ఇదివరకే కొడంగల్‌కు చేరినట్టు తమకు సమాచారం ఉందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంత ప్రాతిపదికన ఎన్నికల్లో కొట్లాడటం లేదన్నారు. తాము తొమ్మిదిన్నరేండ్లుగా చేసిన పనుల గురించి చెబుతున్నామన్నారు.
ప్రోగ్రెస్ రిపోర్టు లాగా ప్రజలకు అన్నీ వివరిస్తున్నామని చెప్పారు. తమ కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. నీతి ఆయోగ్, ఆర్బీఐ రిపోర్టుల సూచీల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి కాదన్నారు. తండ్రి తన కూతురును ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా సార్లు ఆలోచిస్తారని అన్నారు.
ఓటు వేసే ముందు కూడా ప్రజలు ఆలోచించాలన్నారు. అమిత్ షా అబద్దాలకు హద్దేలేదని తెలిపారు. అమిత్ షా తమ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని ఎక్కడికి పోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అని తిడతారంటూ ధ్వజమెత్తారు. ప్రధానికి అంత అహంకారమా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలు తెలంగాణ గల్లీ ఆత్మగౌరవానికి… ఢిల్లీ గుజరాత్ అహంకారానికి మధ్య పోటీ అని స్పష్టం చేశారు. బీజేపీని వాళ్ళ నాయకులే సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. బీజేపీకి ఈ సారి కూడా 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు. ఈ సారి కూడా సీఎం కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను జీహెచ్ఎంసీ, సిరిసిల్లాతో పాటు కామారెడ్డిలో ప్రచారం చేస్తానన్నారు.
మేనిఫెస్టోలో రైతులు , మహిళలు , దళితులు , గిరిజనులు , బలహీన వర్గాలు ,మైనారిటీలు ,పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తామన్నారు. అట్టడుగు వర్గాలకు బీ ఆర్ఎస్ ఊత కర్రలా ఉంటుందన్నారు. ఆర్థిక క్రమ శిక్షణలో తామే ముందు ఉన్నామన్నారు. ఏదీ సాధ్యమో, ఏదీ అసాధ్యమో ప్రభుత్వంలో ఉన్నాం కనుక తమకు తెలుసన్ననారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నానన్నారు.
సిరిసిల్లలో ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీ చేయొద్దని తాను వ్యక్తిగతంగా నిర్ణయించానన్నారు. మిగతా వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ల ఇష్టమన్నారు. కాంగ్రెస్ 2004, 2009లలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. తాము 95 శాతం వరకు తమ మేనిఫెస్టోలోని హామీలు నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ల గలుగుతారనే అంశం పైనే ఎన్నికలు జరుగుతాయన్నారు.
మతం, కులం ప్రాతిపదికన ఓట్లు కొంత వరకే పడతాయన్నారు. బీజేపీతో తమకు పొత్తుంటే ఇన్ని మైనారిటీ స్కూళ్ళు , కాలేజీలు ఎందుకు పెడతామన్నారు. మోడీని సీఎం కేసీఆర్ తిట్టినంతగా ఏ సీఎం తిట్టలేదన్నారు. బీజేపీతో స్నేహం ఉంటె ఎందుకు తిడతామన్నారు. తాము ప్రతీకార రాజకీయాలు చేయటం లేదన్నారు. తాము ఎవరేమన్నా అతి మంచితనంతో వెళుతున్నామన్నారు.
రేవంత్ అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఐటీ ,ఈడీ దాడులు ఎందుకు చేయటం లేదన్నారు. గతంలో వచ్చినట్టే తమకు 88 సీట్లు రావచ్చన్నారు. హుజురాబాద్‌లో కూడా తామే గెలుస్తున్నామన్నారు. ఈటల రాజేందర్ గజ్వెల్లోనే కాదు ఇంకా 50 చోట్ల పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో అని ఎద్దేవా చేశారు.
షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. రాహుల్ గాంధీ, మోడీలు కూడా ఇక్కడ కొచ్చి పోటీ చేసినా అభ్యంతరం లేదన్నారు. త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్ఎస్లో చేరతారన్నారు. కాంగ్రెస్‌లో టికెట్ల ప్రకటన తర్వాత గాంధీ భవన్లో తన్నుకుంటారన్నారు. కాంగ్రెస్ అంటేనే గందర గోళం ,ఆగమాగం అన్నారు. కాంగ్రెస్‌లో అపుడే సీఎం పదవికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు తమకు సమాచారం ఉందన్నారు. గతంలో ఉత్తమ్ మాట్లాడినట్టే రేవంత్ మాట్లాడుతున్నారన్నారు.