ప్రధాని మోడీ (PM Modi) పై మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ కుటుంబ పార్టీ అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అవును తమది ముమ్మాటికి కుటుంబ పార్టీయేనన్నారు. తెలంగాణ ప్రజలంతా తమ కుటుంబమేనన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబంలో కేసీఆర్ (KCR) సభ్యుడు అన్నారు.
రైతు రుణ మాఫీ హామీపై ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని విస్మరించిందన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. మోడీ మాటలు పచ్చి అబద్దాలన్నారు. కరోనా సమయంలో కష్టాలు వచ్చినా రుణమాఫీ చేశామని వెల్లడించారు. రుణ మాఫీ విషయంలో ప్రధాని మోడీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో రూ.37 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. అంతకు ముందు ప్రజా గర్జన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… రెండు కుటుంబ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయంటూ ఫైర్ అయ్యారు. పార్టీ పదవుల్లో ఆయా కుటుంబాల సభ్యులే వుంటారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ మరో పార్టీ చేతిలో వుందన్నారు.
రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల రాబోతున్నందున రుణమాఫీ చేస్తోందన్నారు. ప్రజల ఓట్లు దండుకుని బీఆర్ఎస్ రాజకీయంగా లబ్ది పొందిందన్నారు. కానీ బీజేపీ మాత్రం అన్నదాతలను గౌరవిస్తోందన్నారు. రైతులకు ఎంఎస్పీ ద్వారా రూ. 27 వేల కోట్లు అందజేస్తున్నట్టు చెప్పారు.