ప్రధాని మోడీ (PM Modi) వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ (KTR) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ (BJP) అంటే బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఒక ఫైటర్ అని, అలాంటి వ్యక్తి చీటర్ తో కలవరంటూ ప్రధాని వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నుంచి పలు పార్టీలు ఇప్పటికే బయటకు వచ్చేశాయని పేర్కొన్నారు.
ఎన్టీడీఏ కూటమిలో చేరాలని ఇప్పుడు ఎవరూ అనుకునే పరిస్థితులు లేవని ఫైర్ అయ్యారు. ఎన్డీఏ అనేది మునిగి పోయే పడవ అని ఆయన అన్నారు. అలాంటి పార్టీలో చేరాలని ఎవరూ అనుకోరని తెలిపారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేతలను దర్యాప్తు సంస్థలు వదిలేస్తాయన్నారు. ప్రధాని మోడీ నటనకు ఆస్కార్ తప్పకుండా వస్తుందని ఎద్దేవా చేశారు.
ఆ స్క్రిప్టును సినిమాకు ఇస్తే ఫుల్ సక్సెస్ అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్డీఏ కూటమిలో ఎవరూ కలవాలని అనుకునే పరిస్థితి లేదన్నారు. తాము ఆ కూటమిలో చేరేందుకు పిచ్చికుక్కలమా అని ప్రశ్నించారు. బీజేపీతో దోస్తీ ఎలా ఉంటుందో ఇప్పటికే టీడీపీ, ఎస్ఏడీ చూశాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ మాత్రమే ఉన్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్దారు.
ప్రధాని మోడీకి మీడయాను ఎదుర్కొనే ధైర్యం లేదన్నారు. ప్రధాని చేసిన పసుపు బోర్డు ప్రకటన అతి పెద్ద జోక్ అన్నారు. హామీ ఇచ్చిన 9 ఏండ్లకు ప్రకటన చేసి వెళ్లారన్నారు. ఎన్డీఏను వీడిన పార్టీలపైకి ఈడీ, సీబీఐలను బీజేపీ పపుంతోందన్నారు. ఈ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణకు ఏం ఇచ్చారని ఇప్పుడు ప్రధాని ఓట్లు అడుగుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను సీఎం కావడానికి ప్రధాని మోడీ అనుమతి అవసరం లేదన్నారు.
70 ఏండ్ల వయసులో ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. అబద్ధాలతో ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారని ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్‌పై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సి వుందన్నారు. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతోందన్నారు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు.