పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుకోసం శత విధాలుగా ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూనే.. బీజేపీపై ఆరోపణలు చేస్తుండటం కనిపిస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ తరచుగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.. నేడు వేములవాడలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి హాజరైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు..

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన కేటీఆర్.. అందుకే డమ్మీ క్యాండిడేట్‌ను కరీంనగర్లో కాంగ్రెస్ నిలబెట్టిందన్నారు. అసలు పార్టీ కండువా లేకుంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఆ పార్టీ కార్యకర్తలే గుర్తించలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS)ను 10-12 స్థానాల్లో గెలిపిస్తే.. రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే రోజు ఏడాదిలో వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మాయమవుతాయని జోస్యం చెప్పిన కేటీఆర్.. ప్రజలకు ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ (Congress) ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని అన్నారు.. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి.. వాటిని ఎన్ని రోజులు కాపాడుతారని ప్రశ్నించారు.. లోక్ సభ ఎన్నికలే కాంగ్రెస్ ఉండాలా వద్దా అనేది నిర్ణయిస్తాయని పేర్కొన్నారు..