Telugu News » KTR Tweet: ‘అబద్దాల హస్తం..’ కాంగ్రెస్‌కు కేటీఆర్ వంద ప్రశ్నలు..!!

KTR Tweet: ‘అబద్దాల హస్తం..’ కాంగ్రెస్‌కు కేటీఆర్ వంద ప్రశ్నలు..!!

కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన ట్వీట్ చేశారు. వంద రోజుల పాలనను ఎండగడుతూ వంద ప్రశ్నలను సంధించారు.

by Mano
KTR Tweet: 'Hand of lies..'KTR hundred questions to Congress..!!

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) డిసెంబర్ 7న అధికారం చేపట్టింది. నేటి(ఆదివారం)తో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన ట్వీట్ చేశారు. వంద రోజుల పాలనను ఎండగడుతూ వంద ప్రశ్నలను సంధించారు. ‘వంద రోజుల్లో వంద తప్పులు.. పదేళ్ల తర్వాత రైతులకు తిప్పలు.. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’ అంటూ విమర్శలు గుప్పించారు.

KTR Tweet: 'Hand of lies..'KTR hundred questions to Congress..!!

కేటీఆర్ చేసిన ట్వీట్‌లో ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఒక్కో హామీని గుర్తుచేస్తూ వందరోజుల్లో ఏం చేశారని ప్రశ్నలు సంధించారు. కేటీఆర్ ట్వీట్‌(KTR Tweet)లో ఇలా రాసుకొచ్చారు. ‘‘రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15వేలు, రైతుబంధు, వరి పంటకు బోనస్ రూ.500 బోనస్, ప్రతీ మహిళకు రూ.2500, పింఛన్లు రూ.4వేల పెంపు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడిస్తారన్నారు.

అదేవిధంగా ఒకటో తేదీన జీతాలని చెప్పిన కాంగ్రెస్ అందరికీ ఎందుకివ్వడంలేదన్నారు. 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. గృహజ్యోతికి ఏటా రూ.8వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్‌లో రూ.2,400కోట్లే ఎందుకు పెట్టారని నిలదీశారు. దళిత బంధు పథకాన్ని అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారని,  అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా చేశారంటూ మండిపడ్డారు.

ఒక్కరోజు ప్రజాభవన్‌కు వెళ్లి ముఖం చాటేసిన రేవంత్‌రెడ్డి చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై కుట్ర చేశాడంటూ ఆరోపించారు. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారని, చెరువులు ఎందుకు నింపలేదన్నారు. సాగు నీరు అందించకపోవడం ఘోరమని వ్యాఖ్యానించారు. వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వేళాపాళా లేని కోతలు, కరెంట్ షాకులతో ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటారని మండిపడ్డారు.

రైతు ఆత్మహత్యలకు మళ్లీ తెరలేపడం నేరం కాదా? అని ప్రశ్నించారు. పంజాబ్‌ను తలదన్నిన తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా ఎందుకు మార్చారంటూ నిలదీశారు. యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడే సంస్కృతి ఎందుకు తెచ్చారన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు అని ఆశ పెట్టి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి ఏటా ఇస్తామన్న రూ.12వేలు ఎగ్గొట్టారని, ఆర్డర్లు ఇవ్వకుండా సాంచాల సంక్షోభాన్ని సృష్టించారని అన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుందన్నారు. గురుకుల నియామకాల్లో వెయ్యి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలడం ఎవరి వైఫల్యమన్నారు. వికారాబాద్ అడవులపై రాడార్ చిచ్చుపెట్టారని, నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తెరతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శంషాబాద్ మెట్రోను ముందుచూపు లేకుండా ఎలా రద్దు చేస్తారని, ఫార్మా సిటీని ముక్కలు చేశారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి పథకంతో ఇస్తామన్న తులం బంగారం ఏమైందన్నారు. ఫ్రీ ఎల్ఆర్ఎస్ మాట తప్పి ప్రజల నుంచి రూ.20వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందన్నారు. కేసీఆర్ కిట్ రూ.13వేల ఆర్థికసాయం మరుగునపడిందన్నారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ అందడంలేదన్నారు.

తెల్ల రేషన్ కార్డుల జారీ ఇంకెప్పడన్నారు. విద్యార్థుల బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌కు బ్రేకులు పడ్డాయన్నారు. ధూప దీప నైవేద్యం పథకాన్ని కొండెక్కించారన్నారు. జిల్లాలను కుదించాలని కుట్ర చేయడం తిరోగమన చర్య కాదా అంటూ వ్యాఖ్యానించారు. మూడు నెలలుగా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి జీతాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. 175 మంది రైతులు, గురుకులాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలకు బాధ్యులెవరన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు తెలంగాణను ఏటీఎంగా మార్చేసిందన్నారు. పరిపాలనను గాలికొదిలేసి.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటారా? అని ఎద్దేవా చేశారు.

మైనిఫెస్టోలో రూ.1.70 లక్షల కోట్ల హామీలిచ్చి.. బడ్జెట్‌లో నిధులు కేటాయించరా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. పదేళ్లలో పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని వందరోజుల్లోనే దెబ్బతీశారని, ఎన్నికలకు ముందు మీ పార్టీ ఇచ్చిన ఐదు డిక్లరేషన్లను కాలరాశారని అన్నారు. బాబుతో కలిసి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుతంత్రాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చని కేంద్రంపై అంత ప్రేమ ఎందుకన్నారు. చివరగా కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా? అంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

You may also like

Leave a Comment