ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు(BRS MLA’S) కాంగ్రెస్ (Congress)పార్టీలో చేరిన విషయం తెలిసిందే.తాజాగా ఈ వ్యవహారంపై బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender), స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari)కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆ రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నిక ఖాయం అని స్పష్టంచేశారు.ఇప్పటికే దానం నాగేందర్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారని గుర్తుచేశారు. త్వరలోనే కడియం శ్రీహరి మీద కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరతామన్నారు. స్పీకర్ దగ్గర వ్యవహారం తేలకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్ (KTR)పేర్కొన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఉపఎన్నిక రావడం ఖాయమని అందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా కేటీఆర్ స్పందిస్తూ.. తనకు దానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయించానని ఓ నెత్తిలేని మంత్రి మాట్లాడుతున్నారని, ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. అందుకు సంబంధించి ఏదైనా సాక్ష్యాలుంటే మీ లీకు వీరుడు రేవంత్ రెడ్డిని బయటపెట్టాలని కేటీఆర్ విమర్శించారు.