తెలంగాణ (Telangana) మంత్రివర్గంలో అత్యధికంగా భూ కబ్జా ఆరోపణలు మల్లారెడ్డి (Mallareddy) పైనే వచ్చి ఉంటాయి. చెరువు భూమి కబ్జా, శిఖం భూమి మాయం.. ఇలా ఎప్పుడూ ఆయన పేరు మార్మోగుతుంటుంది. తాజాగా గుండ్ల పోచంపల్లిలోని తన కాలేజీ ఎదురుగా ఉన్న భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నారని మల్లారెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలను మీడియాకు వివరించారు.
మేడ్చల్ (Medchal) జిల్లా గుండ్ల పోచంపల్లిలోని మంత్రి మల్లారెడ్డి కాలేజ్ ఎదురుగా సుంకరి కుటుంబానికి 8 ఎకరాల భూమి ఉంది. అందులో బాధితులు నాలుగున్నర ఎకరాలు కొనుగోలు చేశారు. మరో రెండెకరాలు మంత్రి మల్లారెడ్డి తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే.. మల్లారెడ్డి మొత్తం భూమిని కాజేసేందుకు కట్ర చేస్తున్నారని అంటున్నారు బాధితులు మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డి.
మంత్రి మల్లారెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు బాధితులు. తమ భూమిలోకి వెళ్లకుండా అనుచరులతో మల్లారెడ్డి దాడి చేయించారని ఆరోపించారు. అలాగే, మంత్రి బావమరిది శ్రీనివాస్ రెడ్డి, అతని స్నేహితుడు సురేష్ రెడ్డి గన్ తో షూట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. 30 కోట్ల భూమిని కాజేసేందుకు మంత్రి అన్నిరకాల కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. ఎలాగైనా తమ భూమి తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భూ రికార్డుల్లో తమ పేరు తొలగించి అక్రమంగా వారి పేరు మీదకు మార్చుకున్నారని వాపోయారు. తమలాగే చాలామంది బాధితులు మేడ్చల్ జిల్లాలో ఉన్నారని.. భయపడి ఎవరూ ముందుకు రావడం లేదని.. మల్లారెడ్డి కబ్జాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.