అయోధ్య(Ayodhya)లో భవ్యమైన రామ మందిర ప్రారంభోత్సవం 22 న జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు నిజాం కాలేజీ (Nizam College)లో బిగ్ స్క్రీన్ ద్వారా లైవ్ ఏర్పాటు చేస్తున్నారు.. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ (Laxman) ఏర్పాట్లకు భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ (Congress)పై కీలక వ్యాఖ్యలు చేశారు..
ఎల్లుండి రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు… ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళ సై, బండారు దత్తాత్రేయ రావడానికి సుముఖత చూపారన్నారు. ప్రపంచం మొత్తం శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందని.. ఆ రోజు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే రోజని లక్ష్మణ్ పేర్కొన్నారు.
బాబర్ దురాక్రమణలో అయోధ్య ధ్వంసం అయ్యిందని.. రామ మందిరంపై కోర్టులో కేసు 1885 నుంచి నడుస్తుందన్నారు. అనేక తవ్వకాలు జరిగిన తరువాత చివరికి అయోధ్యలో రాముడి మందిరం ఉందన్న ఋజువులు బయటపడ్డాయని లక్ష్మణ్ తెలిపారు. ఇలా సంవత్సరాల తరబడి ఎదురు చూసిన భక్తుల కల నెరవేరిందని వివరించారు. మరోవైపు కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు.
హిందు మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ కు కొత్తేం కాదని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సోమనాథుని మందిర ప్రారంభోత్సవాన్ని సైతం నెహ్రూ 1951 లో వ్యతిరేకించారని లక్ష్మణ్ తెలిపారు. ప్రస్తుతం ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠకు మద్దతు తెలుపాలని కోరారు.