తెలంగాణ (Telangana)లో ఎన్నికల పోరు పిక్ స్టేజీకి చేరుకున్నట్టు తెలుస్తుంది. జోరు పెంచిన నేతలు.. ప్రచారానికి రెండు రోజులు సమయం ఉన్న క్రమంలో ఓటర్లను ఆకట్టుకుని వీలైనన్ని ఓట్లు రాబట్టుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల ముఖ్య నేతలు కూడా రంగంలోకి దిగారు.. రాష్ట్రంలో విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆరోపణలతో, విమర్శలతో హోరెత్తిస్తున్నారు..
మరోవైపు జాతీయ పార్టీలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ (Nalgonda)లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా సుఖేందర్.. తెలంగాణపై జాతీయ పార్టీల నేతలంగా కన్నేశారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కేంద్ర నాయకత్వం సీఎం కేసీఆర్ (CM KCR) లక్ష్యంగా దండయాత్ర చేస్తుందని విమర్శించారు.
రాష్ట్రంపై విషం చిమ్ముతున్న కేంద్రం.. మోడీ నేతృత్వంలో తెలంగాణకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గుత్తా సుఖేందర్.. బీఆర్‌ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందన్న గుత్తా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆగం అవుతుందని హెచ్చరించారు. ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కాని హామీలు ప్రకటిస్తుందని వెల్లడించారు..
కులమతాల చిచ్చుతో లబ్ది పొందాలని బీజేపీ చూస్తుందని ఆరోపించిన గుత్తా సుఖేందర్.. ప్రధాని కులాల కుమ్ములాటలు ప్రోత్సహించడం సరికాదని హితవు పలికారు.. తెలంగాణకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని గుత్తా సుఖేందర్ పేర్కొన్నారు.. ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే బీఆర్ఎస్ (BRS)కు ఓటు వేసి గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు..