తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రణరంగాన్ని తలపించిన రాజకీయ వాతావరణం.. ఎన్నికలు ముగిశాక కొన్నిరోజులు ప్రశాంతంగానే కనిపించింది. కానీ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చకు కారణం అయ్యాయని అనుకొంటున్నారు. ఈ మంటలు మెల్లగా పార్టీల మధ్య మొదలై గ్రామాల్లో గొడవలు జరిగే పరిస్థితికి దారి తీసిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ (BRS).. కాంగ్రెస్ (Congress) వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఈ వివాదంలో సర్దిచెప్పాల్సిన మంత్రి ఏకపక్షంగా బీఆర్ఎస్ కు చెందిన జడ్పీ చైర్మన్ ని దుర్భాషలాడడనే ఆరోపణలు మొదలైయ్యాయి. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.. ఈ నేపథ్యంలో మంత్రికి అహంకారం తలకెక్కి మాట్లాడుతున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు.
మరోవైపు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ (MP Lingaiah Yadav) కూడా ఈ ఘటనపై ఫైర్ అయ్యారు.. ప్రభుత్వ కార్యక్రమంలో వీధి రౌడీగా ప్రవర్తించిన మంత్రి కోమటిరెడ్డి కోమటిరెడ్డి(Minister Komati Reddy) చర్య ప్రజస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గపు చర్య ఇప్పటి వరకు ఏ మంత్రి చేయలేదని ఆరోపణలు చేశారు.
యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి (ZP Chairman Sandeep Reddy) దాడిపై మీడియా సమావేశంలో తీవ్రంగా విమర్శలు చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల అమలును ప్రశ్నించినందుకే దాడి చేశారని లింగయ్య ఆరోపించారు. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి పై పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలని సూచించారు.