పార్లమెంట్ ఎన్నికల తేదీని ఇంకా ఖరారు చేయలేదు.. కానీ తెలంగాణ (Telangana)లో అప్పుడే మూడు ప్రధాన పార్టీలు విజయం కోసం పరుగులు పెడుతున్నాయి.. ఇప్పటికే బీజేపీ (BJP) 9 మంది అభ్యర్థులను ప్రకటించగా, సూత్రప్రాయంగా ఐదుగురి పేర్లను బీఆర్ఎస్ (BRS) ప్రతిపాదించింది. అదేవిధంగా ఇటీవల అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా 17 ఎంపీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపి కనీసం 14 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలనే భావనలో హస్తం ఉందని అంటున్నారు. కాగా ఇటీవల నియోజకవర్గాల వారీగా జరిపిన సర్వేల్లో పార్టీకి బలం చేకూరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు పార్టీ బలాన్ని పెంచుతాయని భావిస్తోన్న కాంగ్రెస్.. బీజేపీని, బీఆర్ఎస్ ను ఢీకొట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మీ, గృహలక్ష్మీ వంటి పథకాలు మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారంతా తమ పార్టీ వైపే మొగ్గు చూపుతారనే ఆశలో హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల మహిళల ఓటు బ్యాంకుకు ఢోకా లేదనే ధీమాలో నేతలున్నట్లు సమాచారం. అదీగాక గత ప్రభుత్వం పై కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్రెల స్కీం, ఆవుల స్కీం, హెచ్ఎండీఏలతో పాటు ఆయా శాఖల్లో జరిగిన అవినీతి అంశాలు వెలుగులోకి తేవడం కాంగ్రెస్ కు అనుకూలంగా మారాయని నేతలు అనుకొంటున్నారు..
జనాన్ని గోస పెడుతున్న ధరణి పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం.. రైతు భరోసా పేరిట రైతుబంధును కంటిన్యూ చేయడం ఈ స్కీంకు నిధులు విడుదల చేయడం తమకు బోనస్ అని హస్తం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కు ధీటుగా త్వరలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్ క్యాంపెయిన్ వేగవంతం చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం..
ఇక అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఆత్మవిశ్వాసాన్ని అందనంత ఎత్తులో పెంచుకొన్న కాంగ్రెస్.. సార్వత్రిక ఎన్నికల్లో తమ బలాన్ని చూపిస్తుందా? లేక చతికిల పడి.. బీఆర్ఎస్ విమర్శలకు చిక్కుతుందా? అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.. అదీగాక T-కాంగ్రెస్ తన స్ట్రాటజీ తో టార్గెట్ రీచ్ అవుతుందా? లేదా? అనే చర్చలు సైతం మొదలైనట్లు తెలుస్తోంది.