చేతిలో అధికారం ఉన్నంత వరకే నేతలు మాటలు వింటారు.. అది చేయి జారిపోయిందా ఆ పార్టీ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని రాజకీయాల్లో ఎన్నో సార్లు నిరూపించబడింది. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పరిస్థితి ఇలాగే మారిందని అనుకొంటున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎదురు చెప్పిన వారు లేరు.. ఒక్క సారి ఓటమి పలకరించగానే పార్టీ వీడే వారి సంఖ్య పెరుగుతుండటం గులాబీ బాస్ ను ఆందోళనకి గురి చేస్తోందని అంటున్నారు.
అయితే ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ (KCR) అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. నిన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై వారికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి తో టచ్ లోకి వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో కేసీఆర్ స్వరంలో ఉన్న ధీమా ప్రస్తుతం లేదనీ, పార్టీ ఎమ్మెల్యేలపై ఆయనకు పట్టు జారిందనే ప్రచారం మొదలైంది.
అసలే అసంతృప్తిగా ఉన్న నేతలు బీఆర్ఎస్ కు బైబై చెప్పడానికి సిద్దంగా ఉన్నారు.. ఈ సమయంలో అప్పటిలా గట్టిగా మందలిస్తే ఇప్పుడే యాక్షన్ లోకి దిగుతారనే భయం మొదలైందనేది పార్టీ వర్గాల సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కర్ర విరగకుండా, పాము చావకుండా వ్యవహరించి ఎమ్మెల్యేల వలసలను నిరోధించాలన్న టాస్క్ తో కేసీఆర్ ఉన్నారని అనుకొంటున్నారు.
ఇందులో భాగంగా మంచి ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న వారిని కలిస్తే తప్పు లేదనీ, అయితే అలా కలవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలున్నాయని వివరించినట్టు తెలుస్తోంది. మరోవైపు లోకసభ ఎన్నికలలో (Lok Sabha Elections) బీఆర్ఎస్ చతికిలపడితే.. వలసలను ఆపడం సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమైన బీఆర్ఎస్.. ఈ గడ్డుపరిస్థితుల నుంచి గట్టెక్కితే గాని వాడిపోతున్న గులాబీ, రాష్ట్రంలో వికసించే అవకాశాలు బలపడతాయని విశ్లేషకుల భావన.. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు మాత్రమే కాదు కేసీఆర్ కు కూడా ‘డూ ఆర్ డై’ లా మారాయని అంటున్నారు.. అయితే ప్రస్తుతం పోటీ అంతా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య ఉండే అవకాశాలున్నాయని భావిస్తున్నారు..