జనవరి 22న భగవాన్ శ్రీ రాముడు తన ఆలయంలో మనకు దర్శనం ఇస్తాడని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’ (Pran Pratishtha) కార్యక్రమానికి తనను ఆహ్వానించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రాణ ప్రతిష్టకు ముందు తాను 11 రోజుల ప్రత్యేక అనుష్టానాన్ని ప్రారంభించానని చెప్పారు.
మాతా శబరి లేకుండా శ్రీరాముని కథ అసంపూర్ణంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్ మన్), ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (పీఎంఏవై-జీ) కింద లక్ష మంది లబద్దిదారులకు తొలి విడత నిధులను ప్రధాని మోడీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ…. రామ్ లల్లా ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమానికి ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉందని అన్నారు. సంప్రోక్షణ సమయంలో దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు నుండి 11 రోజుల పాటు ప్రత్యేక పూజను ప్రారంభిస్తున్నానన్నారు.
వంట గ్యాస్, విద్యుత్,సురక్షిత మంచినీరు, హౌసింగ్ పథకాలను వినియోగించుకున్న తర్వాత గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చాయని మోడీ తెలిపారు. పదేళ్లుగా తమ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకు వచ్చామన్నారు.