కాంగ్రెస్(Congress) పార్టీ గతంలో ఎల్ఆర్ఎస్(LRS) వద్దనీ.. భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పి నేడు మాట తప్పడంపై బీఆర్ఎస్(BRS) శ్రేణులు భగ్గుమన్నారు. ఎల్ఆర్ఎస్ను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన(BRS protests) కార్యక్రమాలు చేపట్టారు. నాడు అడ్డగోలుగా మాట్లాడిన నేటి కాంగ్రెస్ మంత్రులు, ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు..ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడుతామని హెచ్చరించారు.
అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మాట తప్పుతోందని విమర్శించారు. హైదరాబాద్‌లో అమీర్‌పేటలోని మైత్రివనం వద్ద కార్యకర్తలతో ధర్నాలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక ఫీజులు వసూలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఉచిత ఎల్ఆర్ఎస్ అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై కాంగ్రెస్ నేతలు ఎందుకు కట్టుబడి లేరని కేటీఆర్ నిలదీశారు. మార్చ్ 31 లోపు ఎల్ఆర్ఎస్ కట్టమని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. రూ.20వేల కోట్ల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధమయ్యారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ పై గతంలో రేవంత్‌రెడ్డి, మంత్రులు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని అన్నారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజలపై భారం మేపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ఎత్తేస్తామని హామీ ఇచ్చిందనీ.. ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం సరికాదని ఆయన ఫైర్ అయ్యారు.