మధ్యప్రదేశ్(Madhyapradesh)లోని గ్వాలియర్(Gwalior)లోని సింధియా నగర్(Scindia Nagar)లో పెను ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబసభ్యులు తీవ్రగాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సింధియానగర్‌లో అవధేష్ ప్రజాపతి టిక్కీ స్టాల్ నిర్వహిస్తూ కుటుంబసభ్యులను పోషించుకుంటున్నాడు.
శనివారం మధ్యాహ్నం అతడి భార్య బంగాళదుంపలు వండుతుండగా అవధేష్ భోజనం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారి ఇంటిపైకప్పుపై హైటెన్షన్ వైరు పడింది. ఈదురుగాలులు వీస్తున్న సమయంలో హైటెన్షన్ వైరు టిన్ షెడ్డుపై పడటంతో షెడ్డుకు విద్యుత్ ప్రసారమైంది. దీంతో ఇంట్లో ఉంచిన 5కిలోల చిన్న సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలి మంటలంటుకున్నాయి.
ఈ ప్రమాదంలో ఇంటి గోడ కూలింది. అవధేష్‌తో పాటు అతని భార్య గుడ్డి బాయి, కుమార్తెలు రేష్మ, కుసుమ్, కుమారుడు రాజా కూడా ఇంట్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో అవదేష్ కు 70శాతం, అతడి భార్యకు 90శాతం తీవ్రగాయాలయ్యాయి. వారితో పాటు కుసుమ్, రాజా అనే కూతురు, కొడుకులకు 65 నుంచి 70 శాతం, రేష్మ అనే అమ్మాయికి 50 శాతం కాలిన గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు మంటలను అదుపుచేశారు. అయితే కుటుంబసభ్యులంతా తీవ్రగాయాలపాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి వైద్యమందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి ఇరుగుపొరుగు వారి నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.