Telugu News » Mahabubnagar : భగ్గుమన్న వేరుశనగ రైతులు.. మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌పై దాడి..!

Mahabubnagar : భగ్గుమన్న వేరుశనగ రైతులు.. మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌పై దాడి..!

గతంలో ధరలు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ మద్దతు ధర రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులతో మాట్లాడతానని ఛైర్‌పర్సన్‌ అరుణ రైతులకు నచ్చజెపారు.. అయినా శాంతింపని రైతులు ఛైర్‌పర్సన్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది.

by Venu

వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు.. వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులు సరైన ధర నిర్ణయించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా, అచ్చంపేట (Acchampet)లో గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో కర్షకులు కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఛైర్‌పర్సన్‌ను బలవంతంగా వేరుశనగ కుప్పల వద్దకు లాక్కెళ్లారు. పలువురు మహిళా రైతులు ఆమెపై దాడి చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.

మరోవైపు మార్కెట్‌కు వచ్చిన వేరుశనగ (Ground Nut)కు ధర నిర్ణయించిన అనంతరం క్వింటాకు కనీసం రూ.7000 ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఛైర్మన్ ఛాంబర్‌కు వెళ్లారు. గతంలో ధరలు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ మద్దతు ధర రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులతో మాట్లాడతానని ఛైర్‌పర్సన్‌ అరుణ రైతులకు నచ్చజెపారు.. అయినా శాంతింపని రైతులు ఛైర్‌పర్సన్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన సమాచారం అందుకొన్న పోలీసులు మార్కెట్ యార్డ్ కు చేరుకొన్నారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతుల ఆందోళన విరమింపజేసే ప్రయత్నంలో తోపులాట చోటు చేసుకొంది. మొత్తానికి రైతులను పోలీసులు శాంతింపచేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వేరుశనగకు రీటెండర్ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరోవైపు ఆదివారం అచ్చంపేట మార్కెట్‌కు 32,875 బస్తాల వేరుశనగ వచ్చింది.

వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా ఇద్దరు రైతులకు రూ.5000 లోపు ధర పలికింది. కానీ రైతులు రూ.7000 కన్నా ఎక్కువ ధర డిమాండ్ చేస్తున్నారని దీనిపై వ్యాపారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే వనపర్తి, కల్వకుర్తి, ఇతర మార్కెట్ల కన్నా అచ్చంపేటలోనే అధిక ధరలు ఉన్నాయని మార్కెట్‌ కార్యదర్శి వెల్లడించారు. మరోవైపు కల్వకుర్తి (Kalvakurti)లోనూ వేరుశనగ రైతులు గిట్టుబాటు ధర కోరుతూ రోడ్డెక్కారు.

మార్కెట్​ నుంచి కోదాడ-రాయచూరు హైవేలోని హైదరాబాద్​ కూడలి వద్ద మూడున్నర గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కూడలికి మూడు వైపుల సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.. వ్యాపారులతో కుమ్మకై తక్కువ ధరలు నిర్ణయిస్తున్నారని మార్కెట్​లో డిమాండ్​ ఉన్నా సరైన ధరలు ఇవ్వట్లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment