శాసనసభలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై జరుగుతున్న చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది. ఇప్పటికే ఈ సమావేశంలో పలువురు నేతలు సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపిన మహేశ్వర్ రెడ్డి.. హామీలు అమలు చేయడానికి 100 రోజుల సమయం ఇస్తున్నామని హెచ్చరించారు..
మరోవైపు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణీ కార్యక్రమంపై సైతం ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే.. ప్రజావాణీ పేరుతో పబ్లిసిటీ చేయాలని చూస్తే బీజేపీ (BJP) పోరాటం చేస్తుందని మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) అన్నారు.. అధికారంలోకి రావాలనే ఆరాటంతో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినట్లుగా ఉందని ఆరోపించిన మహేశ్వర్ రెడ్డి.. బడ్జెట్ కు భారంగా కాంగ్రెస్ పార్టీ హామీలు వున్నాయని తెలిపారు. వీటివల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం వుందని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజారిటీ ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. సీఎంకు పాలనా అనుభవం లేకపోయినా కాంగ్రెస్ సీనియర్ల సలహాలతో ముందుకు వెళ్ళాలని సూచించారు.. మరోవైపు మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Dupty CM Bhatti Vikramarka) స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకు ఆర్థిక సాయం చేసేలా ప్రయత్నం చేయాలని కోరారు.
ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చేందుకు ఉన్న షరతులు ఏంటో అందరికీ తెలుసని వెల్లడించిన భట్టి విక్రమార్క.. ఈ అంశాన్ని తమపై నెట్టి బీజేపీ చేతులు దులుపుకోవాలని చూడటం సరైంది కాదన్నారు. మరోవైపు తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచేలా మోదీ మాట్లాడారని అందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గుపడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోసం పాలమూరుకు జాతీయ హోదా ఇప్పించాలని కోరారు.