లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ (PM Modi) పర్యటనతో మాల్దీవుల (Maldives)కు వణుకు పుడుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీపై ఆ దేశ మంత్రులు నోరు పారేసుకుంటున్నారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో భారత్ పోటీ పడుతుందా అంటూ భారత్ ను తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగుతోంది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యలపై భారత పౌరులు నిప్పులు చెరుగుతున్నారు. భారత సెలబ్రిటీలు కూడా మాల్దీవుల మంత్రులకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు.
మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ రాజకీయ నేతలు మండిపడుతున్నారు. తమ అత్యంత సన్నిహిత పొరుగు దేశం గురించి చేసిన వ్యాఖ్యలతో తీవ్రమవుతున్న పరిస్థితిని చూసి తాము చాలా ఆందోళనకు గురవుతున్నామని ఆ దేశ క్రీడాశాఖ మాజీ మంత్రి అహ్మద్ మలూఫ్ తెలిపారు. మాల్దీవులను బాయ్ కాట్ చేస్తూ భారతీయులు తీసుకున్న నిర్ణయంతో తమ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం నుంచి కోలుకోవడం కష్టమని చెప్పారు. వీలైనంత త్వరగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని వెల్లడించారు.
ఒక విదేశీ నేత (ప్రధాని మోడీ)కి వ్యతిరేకంగా ఓ మంత్రి చేసిన జాత్యహంకార, అవమానకర వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్టు మాల్దీవుల నేషనల్ పార్టీ పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని చెప్పింది. సంబంధిత వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు ట్వీట్ చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరింది.
మంత్రుల వ్యాఖ్యలతో స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ మాల్దీవులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగింది. మోడీతోపాటు భారత్ పై వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై సస్పెన్షన్ వేటు వేసింది. విదేశీ నేతలపై సోషల్ మీడియాలో చేసిన అవమానకర వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పింది. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలని వివరించింది. వాటిని మాల్దీవుల అభిప్రాయంగా పరిగణించవద్దని కోరింది.
మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక గమ్యస్థానం లక్షద్వీప్ అనే భావనకు బాలీవుడ్ సెలబ్రిటీలు మద్దతు ప్రకటిస్తున్నారు. బాయకాట్ మాల్దీవులు అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్‌లోని లక్షద్వీప్, సింధుదుర్గ్ లాంటి ద్వీపాలను సందర్శించాలని సెలబ్రిటీలకు నెటిజన్లు పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దీనికి మద్దతు తెలిపారు.
లక్షద్వీప్‌లో పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ ఇటీవల అక్కడ సముద్ర తీరంలో పర్యటించారు. బీచ్ లో వాకింగ్ చేశారు.అనంతరం స్నార్కెలింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. లక్షద్వీప్ అందాలు మంత్ర ముగ్దులను చేస్తాయని, సాహసయాత్రికులు తమ అడ్వెంచరస్ ప్రదేశాల జాబితాలో లక్షద్వీప్ చేర్చుకోవాలన్నారు.
ఈ నేపథ్యంలో లక్షద్వీప్‌లో మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీపడడంలో భారత్ సవాళ్లు ఎదుర్కొంటోందని ఎద్దేవా చేశారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోటీ పడాలనుకుంటే అది కేవలం భ్రమే అవుతుందంటూ మోడీ లక్షద్వీప్ పర్యటన వీడియోలను షేర్ చేస్తూ ఆ దేశ మంత్రులు ట్వీట్ చేశారు. దీంతో దుమారం రేగింది.