– ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి..?
– త్వరలో నేను కూడా కలుస్తా
– కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదు
– పార్టీ ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు
– అధిష్టానం ఎంపీగా పోటీ చేయమంటోంది
– నేను నా కుమారుడికి ఇవ్వాలని అడుగుతున్నా
– మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో కానీ, రాజకీయాల్లో కానీ ప్రత్యేకంగా కనిపించే మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని ప్రకటించారు. గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. గతంలో తామిద్దరం టీడీపీలో కలిసి పనిచేశామని తెలిపారు.
ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలుద్దామని నిర్ణయించుకొన్నానని తెలిపారు. అధికారంలో ఉన్న వారితో ఎన్నో పనులుంటాయని.. వాటి కోసం కలిస్తే తప్పేముందని వ్యాఖ్యానించారు. సీఎంను కలిసే ముందు చర్చకు తావులేకుండా మీడియాకు సమాచారం ఇస్తానని వెల్లడించారు.
మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోతామని.. కాంగ్రెస్ గెలుస్తుందని కలలో సైతం ఊహించలేదన్నారు. ఈ విషయంలో తాము ఇంకా షాక్ లో ఉన్నామని.. ఆ షాక్ నుంచి ఒక్కొక్కరం మెల్లగా తేరుకొంటున్నామని అన్నారు. మరోవైపు తాను ఎంపీగా పోటీ చేసే అంశంపై స్పందించారు. ఆ టికెట్ ను తన కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నానని తెలిపారు.
పార్టీ టికెట్ ఎవరికిచ్చినా బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని తెలిపారు. రాజ్యసభ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని మీట్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి కోసం కలిశామని నేతలు ప్రకటిస్తున్నా..తెర వెనుక ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.