పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) వేళ స్టేట్ పాలిటిక్స్‌లో కొత్త కొత్త వార్తలు చోటు చేసుకొంటున్నాయి. తెలంగాణ (Telangana)లో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ (Congress).. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం సత్తా చాటేలా వ్యుహాలు రచిస్తోంది.
ఇక దేశ వ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీ (BJP) సైతం సౌత్ ఇండియాలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ (BRS) పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతాయని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను కమలం నేతలు ఖండిస్తున్నారు. కానీ ఈ అంశంపై బీఆర్ఎస్ లీడర్లు మాత్రం నోరు విప్పడం లేదు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు నిజమే కావచ్చనే అనుమానాలు నెలకొన్నాయి.
మరోవైపు మల్లారెడ్డి బీజేపీతో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లో లేరని.. వారంతా పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చారు. బండి సంజయ్ జూటా మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయనతో అయ్యేది లేదు.. పొయ్యేది లేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ బీజేపీతో పొత్తు ఉన్న.. అలయెన్స్‌లో భాగంగా మల్కాజిగిరి ఎంపీ టికెట్ తన కొడుకు భద్రారెడ్డికే వస్తుందని పరోక్షంగా హింట్ ఇచ్చారు.
ఫ్యామిలీ పాలిటిక్స్ అని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన మల్లారెడ్డి (Mallareddy).. భద్రారెడ్డికి టిక్కెట్ ఇస్తే అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. తన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు.. మా కుటుంబం వేరని క్లారిటీ ఇచ్చిన ఆయన.. మా యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు ఉంటే చర్యలు తీసుకోవచ్చన్నారు. కానీ, తమపై ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే మాత్రం, ఆ నిర్ణయం సరికాదని వెల్లడించారు..