108
పదేండ్లుగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ (Modi) ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge) మండిపడ్డారు. ఇప్పుడు హామీల గురించి ప్రశ్నించిన రైతుల గొంతులను మోడీ సర్కార్ నొక్కేస్తోందని విమర్శించారు. ఢిల్లీలోకి ప్రవేశించకుండా రైతులను అధికారులు అడ్డుకోవడంతో రాజధాని కాస్త వర్చువల్ కోటగా మారిందని ఫైర్ అయ్యారు.
రైతుల గొంతును అణచి వేసేందుకు నియంతృత్వ మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రైతును ‘ఆందోళన జీవి’, ‘పరాన్న జీవి’ అని పిలిచి 750 మంది రైతులు ఎలా పరువు తీశారో గుర్తు చేసుకోండని అన్నారు. పదేళ్లలో అన్నదాతలకు ఇచ్చిన మూడు వాగ్దానాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఖర్గే మండిపడ్డారు.
ఆ మూడు హామీల్లో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, స్వామినాథన్ నివేదికకు అనుగుణంగా 50 శాతంతో పాటు ఇన్పుట్ ఖర్చులు అమలు చేయడం, ఎంఎస్పీకి చట్టపరమైన హోదా కల్పించడం వంటివి ఉన్నాయని వివరించారు. రైతులు కూడా దేశంలో భాగమేనని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నమ్మిందని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్చేవాలా అన్నారు.
రైతులపై బీజేపీ చేసిన క్రూరమైన దాడి చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. రైతులపై పోలీసుల దాడిని, హర్యానాలో ఆందోళనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడాన్ని ఖండించారు. రైతుల నిరసనను అణిచివేసే బదులు పెంచిన అహం, అధికార దాహాలను తగ్గించుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టాలన్నారు.
ఈ మార్చ్కు రైతుల యూనియన్ పిలుపునిచ్చిందన్నారు. రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే ఈ దేశం మొత్తం వారి వెంట ఉంటుందని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ తెలిపారు. రైతులు తమ వైఖరిని చెప్పడానికి వస్తున్నారని… ప్రభుత్వం వారి మాట వినాలని సూచించారు.