విపక్ష ఇండియా కూటమి (India Allaince) చైర్ పర్సన్‌గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నియమితులయ్యారు. విపక్ష ఇండియా కూటమి నేతలు ఈ రోజు వర్చువల్ గా సమావేశం అయ్యారు. ఇండియా కూటమి కన్వీనర్‌గా బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను ఈ సమావేశంలో కూటమి సభ్యులు ఎన్నుకున్నారు.
ఈ సమావేశానికి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. దీంతో ఈ ఎన్నిక గురించి వారికి సమాచారం అందిస్తామని కూటమి వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా వుంటే కూటమి కన్వీనర్ పోస్టును నితిశ్ కుమార్ తిరస్కరించినట్టు జేడీయూ నేత సంజయ్ ఝా వెల్లడించారు. కాంగ్రెస్‌లోని మరో నేత ఎవరైనా ఈ పదవిని చేపట్టాలని నితీశ్ కుమార్ కోరారని ఝా వెల్లడించారు.
ఆయనకు ఈ పదవి ఇచ్చే విషయంలో ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. ఈ నేపత్యంలో అన్ని పార్టీల ఆమోదంతోనే తాను ఈ పదవిని చేపట్టాలని నితీశ్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం, భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించిన అంశాలపై
చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి కేంద్రంలోకి రాకుండా చూసేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే విపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి. అనంతరం తమ కూటమి పేరును ‘ఇండియా’గా ప్రకటించాయి. పలు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసే అంశంపై విపక్ష పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నాయి.