Malikharjun Kharge : దేశ 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ (Modi) ఎర్ర కోటపై దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగ కార్యక్రమానికి కాంగ్రెస్ (Congress) చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే (Mallikharjun Kharge) హాజరు కాలేదు. ఆయనకు ఉద్దేశించిన ఎర్ర రంగు కుర్చీ ఖాళీగా కనిపించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. రెడ్ ఫోర్ట్ వేడుకకు ఖర్గే హాజరయి ఉంటే తన నివాసంలోను, పార్టీ ప్రధాన కార్యాలయం లోను జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఆయన మిస్ అయి ఉండేవారని ఈ వర్గాలు పేర్కొన్నాయి.
పైగా సెక్యూరిటీ పరమైన కారణాలు కూడా ఉన్నాయని, తన ఇంటి నుంచి రెడ్ ఫోర్ట్ వరకు వెళ్లాలంటే ఖర్గేకి రెండు గంటలు పడుతుందని, ముందుగానే ఆయన తన ఇంటినుంచి బయల్దేరలేకపోయారని వివరించాయి. తమ పార్టీ అధ్యక్షుడు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా తెలిపారు. మంత్రులతో సహా అనేకమంది ఎర్రకోటను సకాలంలో చేరలేకపోయారని ఆయన చెప్పారు. తమ నేత మోడీ ప్రసంగ కార్యక్రమానికి గైర్ హాజరయినందుకు బీజేపీ బహుశా అసంతృప్తికి గురై ఉంటుందని కాంగ్రెస్ కే చెందిన మరో నాయకుడు పవన్ ఖేరా సెటైర్ వేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం నాడు మా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసే ‘స్వాతంత్య్రం’ మాకు లేదా అన్నారు. కాగా గత కొన్నేళ్ల లోనే ఈ దేశం అభివృద్ధి చెందినట్టుగా కొందరు మాట్లాడుతున్నారని ఖర్గే.. మోడీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శిస్తూ ఓ వీడియో మెసేజ్ ని విడుదల చేశారు.
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ. నరసింహారావు, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి మాజీ ప్రధానులు ఈ దేశానికి చేసిన సేవలను ఆయన ప్రస్తావించారు. బీజేపీ నేత, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరును కూడా ఆయన గుర్తు చేశారు. ప్రతి ప్రధాన మంత్రీ ఈ దేశ అభివృద్ధికి తమవంతు సేవలు అందించారన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం రెండూ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని, సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్ధల ద్వారా విపక్షనేతలను వేధిస్తూ వారి నోళ్లను మూయిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.