లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి ‘ఇండియా’ కేంద్రంలో అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్డీలను రద్దు చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె అస్సాం(Assam)లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
దేశాన్ని బీజేపీ ఓ నిర్బంధ శిబిరంగా మార్చేసిందంటూ ఆరోపించారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయితే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని, దేశంలో అసలు ఎన్నికలనేవే ఉండవని హెచ్చరించారు. దేశాన్ని వాళ్లు నిర్బంధ శిబిరంలా మార్చేశారని.. ఇంత ప్రమాదకరమైన ఎన్నికలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.
అన్ని మతాలనూ తమ పార్టీ ప్రేమిస్తుందన్న ఆమె మతాల ప్రాతిపదికన విభజనను మాత్రం తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌరస్మృతి ఉండవని తెలిపారు. వివక్షతో ఉన్న అన్ని చట్టాలను రద్దు చేస్తామని స్పష్టంచేశారు.
అస్సాంలో తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన నలుగురు అభ్యర్థులను గెలిపించాలని ఈసందర్భంగా అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. 2026 లో జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 126 స్థానాల్లో పోటీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు దీదీ. ‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ఫైనల్ ఇంకా రాలేదు.. మళ్లీ వస్తా’ అంటూ మమత బెనర్జీ వ్యాఖ్యానించారు.