Telugu News » High Court : మన తొలివెలుగు ఎఫెక్ట్.. థర్డ్ డిగ్రీ కేసుపై హైకోర్టు ఫోకస్!

High Court : మన తొలివెలుగు ఎఫెక్ట్.. థర్డ్ డిగ్రీ కేసుపై హైకోర్టు ఫోకస్!

మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సుమోటోగా కేసును స్వీకరించింది. దీనిపై త్వరలో ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

by admin
Petition in High Court to Postpone Group 2 Exam

ఈమధ్య మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన తెలంగాణ (Telangana) వ్యాప్తంగా సంచలనం రేపింది. విచారణ పేరుతో మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి రాత్రి సమయంలో చావగొట్టారు పోలీసులు (Police). ఎల్బీనగర్ పరిధిలో జరిగిన ఈ ఘటనను తొలుత హైలైట్ చేసింది ‘మన తొలివెలుగు’ (Mana Tolivelugu). బాధితురాలిని కలిసిన జర్నలిస్ట్ రఘు (Journalist Raghu).. ఆమె బాధను అందరికీ తెలిసేలా చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి పోలీసులు ప్రవర్తించిన తీరును.. బాధితురాలు వివరిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీని తర్వాతే న్యూస్ ఛానల్స్ ఈ ఇష్యూపై దృష్టి సారించాయి.

High Court Takes LB Nagar Tribal woman Case As suo moto

తాజాగా ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఫోకస్ పెట్టింది. మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సుమోటోగా కేసును స్వీకరించింది. దీనిపై త్వరలో ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీంతో బాధితురాలికి న్యాయం జరుగుతుందని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని మొదటగా సంప్రదించి వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్ రఘుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

అసలేం జరిగిందంటే..?

బాధితురాలి కథనం ప్రకారం.. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉంటోంది బాధిత మహిళ. కుమార్తె పెళ్లి కోసం సరూర్‌ నగర్‌ లోని బంధువుల ఇంటికి డబ్బుల కోసం వెళ్లింది. ఆగస్టు 15న రాత్రి తిరిగి ఎల్బీనగర్‌ కు రాగా పోలీసులు ఆపారు. ఎవరు నువ్వు..? ఇక్కడేం చేస్తున్నావు..? ఏంటీ కథ..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ఫలానా అని చెప్పినా వినిపించుకోలేదు. అన్నీ తెలుసులే.. అంటూ వెటకారంగా మాట్లాడుతూ.. ఆమెను తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌ కు తీసుకువెళ్లారు. చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎదురు తిరిగితే నీ సంగతి తెలుసు అంటూ.. ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలు ‘‘మన తొలివెలుగు’’కు వివరించింది.

ఉదయం ఓ అధికారి ఆదేశాల మేరకు బాధితురాలిని ఎల్బీనగర్ పోలీసులు వదలిపెట్టారు. ఈ దాడిలో ఆమె నడవలేని స్థితికి చేరుకుంది. అకారణంగా పోలీసులు తనని కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై రాచకొండ సీపీ చౌహాన్ స్పందిస్తూ ఇద్దరు పోలీసులపై వేటు వేసినట్టు తెలిపారు. ఇప్పుడు దీనిపై హైకోర్టు దృష్టి సారించడంతో బాధితురాలికి న్యాయం జరుగుతుందని.. మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయని భావిస్తున్నారు ప్రజలు.

You may also like

Leave a Comment