వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys Sharmila) కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకుంటారంటూ గత కొన్ని నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore) స్పందించారు.
ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ…. కాంగ్రెస్‌లో షర్మిల చేరే విషయంపై అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ కూతురిగా షర్మిలా అంటే తమకు చాలా గౌరవం ఉందని తెలిపారు.
పార్టీలో షర్మిల చేరే విషయాన్ని, ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని వివరించారు. ఆమె రాకను కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఆమెతో పాటు పార్టీ బలోపేతం కోసం ఎవరు వచ్చినా తాము ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. అంతకు ముందు తెలంగాణ రాజకీయాల్లో చాలా చురుగ్గా షర్మిలా పాల్గొన్నారు.
అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పై ఎప్పటికప్పుడు విమర్శల వర్షం కురిపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరతారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. పలు మార్లు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ సంచలన ప్రకటన చేశారు.