Manipur: మణిపూర్ లో తిరిగి ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయని, క్రమంగా లా అండ్ ఆర్డర్ మెరుగు పడుతోందని రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి కేంద్రం అదనంగా సాయం చేయాలని, నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సి ఉందన్నారు. పలు జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో అనేకమంది ఇళ్ళు నాశనమయ్యాయని, వారికి పునరావాసం కల్పించవలసి ఉందని ఆయన చెప్పారు.
రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని అమిత్ షా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కాగా మణిపూర్ లో పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ఆరోపించారు. మా రాష్ట్రంలో హింస పెట్రేగడానికి ఆ పార్టీయే కారణం.. మనుషుల జీవితాలతో వాళ్ళు రాజకీయం చేశారు.. ఆటలాడుకున్నారు.. రాహుల్ గాంధీ లడఖ్ లో ఉన్నప్పుడు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడుతారు అని బీరేన్ సింగ్ ప్రశ్నించారు.
మీరు లడఖ్ వెళ్తే అక్కడి సమస్యల గురించే మాట్లాడాలి అన్నారు. మణిపూర్ లో మళ్ళీ శాంతి నెలకొల్పేందుకు ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ, అమిత్ షా చర్యలు తీసుకుంటున్నారని, వారి సలహాలను కూడా తాము పాటిస్తున్నామని ఆయన చెప్పారు.
కాగా రాష్ట్ర అసెంబ్లీ ఈ నెల 29 న సమావేశం కానుంది. నిజానికి ఈ నెల 21 న శాసనసభ సమావేశం కావలసి ఉన్నా అనివార్య కారణాల వల్ల 29 కి వాయిదా వేశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను తెలియజేస్తారని భావిస్తున్నారు.