ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha), సీఎం కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్ విషయంలో కొందరు గగ్గోలు పెట్టడం కనిపిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Manne Krishank) కీలక వ్యాఖ్యలు చేశారు.. కేంద్రం అక్రమంగా అరెస్ట్ లు చేసి ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ పై విమర్శలు గుప్పించారు..
దేశంలో బీజేపీ కాకుండా ఇతర పార్టీ ఏది ఉండకుండ ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే కేరళ సీఎం విజయన్ కుమార్తెపై ఈడీ కేసు నమోదు చేశారు.. ఆర్జేడీ, శివసేన, డీఎంకే, టీఎంసీ, సమాజ్ వాదీ నేతలకు నోటీసులు ఇస్తున్నారు.. ఎన్నికల టైమ్ లో ఇలాంటివి వ్యూహాత్మకంగా అమలుచేసి ఇతర పార్టీలు గెలవకుండా చేస్తున్నారని మన్నె క్రిశాంక్ మండిపడ్డారు..
ఈ కేసులు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా.. విచారణలో పాల్గొనాలా అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని ఆరోపించిన మన్నె క్రిశాంక్.. పదేళ్లు మోడీ (Modi) ప్రభుత్వం ఏం చేసిందో చర్చ లేకుండా చేస్తున్నారని విమర్శించారు.. ఈడీ చర్యలు చూస్తుంటే.. దేశంలో ఎన్నికలు నడుపుతున్నది ఈసీ కాదు.. ఈడీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష నేతలు ప్రచారంలో పాల్గొనకుండా ఈడీ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.. బీజేపీలో చేరి లొంగితే ఎలాంటి కేసులు, అరెస్టులు ఉండవన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు జైళ్లో ఉంటే.. గెలుపు సులభం అవుతుందనే భావనలో మోడీ ఉన్నారని మన్నె క్రిశాంక్ వ్యాఖ్యానించారు. 400 సీట్లు వచ్చే ధైర్యం ఉంటే.. నేతలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రశ్నించారు..