తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఊహించని విధంగా ఫలితాలు రావడంతో బీజేపీ ఆలోచనలో పడినట్టు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని భావించిన కమలానికి.. కాంగ్రెస్ షాకిచ్చి అధికారంలోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి కారణం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ (Bandi Sanjay)ని తొలగించడం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్ర బీజేపీ (BJP)కి త్వరలో కొత్త నాయకుడు వస్తారా? ఈ ప్రశ్నకు పార్టీల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అయితే కిషన్ రెడ్డి (Kishan Reddy)ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు మాత్రమే ఈ బాధ్యతలు నిర్వహిస్తానని జాతీయ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం బీజేపీ అగ్ర నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లకు సీఎంలను నియమించే పనిలో ఉంది. అయితే ఆ మూడు రాష్ట్రాలకు సీఎంల ఎంపికపై స్పష్టత వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే రాష్ట్ర అధ్యక్ష పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
మరోవైపు సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవకపోవడంతో.. ముందుగా తన నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దాలని కిషన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే కిషన్ రెడ్డి రాజీనామా అనంతరం ఆ పదవి ఎవరికి దక్కుతుందా అనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఇప్పటికే ఈ పోటీలో బండి సంజయ్, ఈటల, ధర్మపురి అరవింద్ ఉన్నారు.. అయితే బండి సంజయ్ కే ఎక్కువ అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం..