మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల (Maratha Quota) ఉద్యమం ముగిసింది. వారి డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) అంగీకరించింది. దీంతో ఉద్యమకారుడు మనోజ్ జరాంగే (Manoj Jarange) శనివారం ఉదయం 8 గంటలకు తన నిరసన దీక్షను విరమించారు.
కేబినెట్ మంత్రులు దీపక్ కేస్కర్, మంగళ్ లోధా నేతృత్వంలోని ప్రతినిధి బృందం మనోజ్ జెరాంగేను కలవడానికి అర్ధరాత్రి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. జరాంగే డిమాండ్లను నెరవేరుస్తున్నట్లు ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఆ కాపీని అందజేశారు. సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో మనోజ్ జరాంగే జ్యూస్ తాగి నిరాహార దీక్షను విరమించారు.
మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే నేతృత్వంలో కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీరి డిమాండ్లను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో వేలమంది ముంబై దిశగా ర్యాలీ చేపట్టారు. అయినా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో తాజాగా జరాంగే డెడ్లైన్ విధించారు.
ప్రభుత్వం శనివారం ఉదయం 11 గంటలలోపు అధికార ప్రకటన చేయాలని లేదంటే 12గంటలకు కార్యాచరణ ప్రకటిస్తానని జరాంగే హెచ్చరించారు. తమ అడుగులు ముంబైలోని ఆజాద్ మైదాన్ దిశగానే పడుతాయని, ఒక్కసారి అడుగు పడిందంటే వెనక్కి తిరిగి చూసేది లేదని చెప్పారు. వీరి డెడ్లైన్కు దిగివచ్చిన మహా సర్కార్.. డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది.