తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం.. గత ప్రభుత్వం చేసిన అవినీతి పై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా విద్యుత్ శాఖలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తుండటంతో సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ పై సమీక్ష నిర్వహించారు.. దీంతో 85 వేల కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు.
ఈ అంశం పై స్పందించిన రేవంత్ రెడ్డి.. సీఎండీ ప్రభాకర్ రావు (CMD Prabhakar Rao) రాజీనామా ఆమోదం తెలపవద్దని సమీక్షకు ఆయన్ను కూడా పిలవాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ సమీక్షకు సీఎండి ప్రభాకర్ హాజరుకాలేదు. దీంతో ప్రభాకర్ పై రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీరియస్ అయినట్లు ప్రచారం జరిగింది.
ఈ విషయంలో స్పందించిన సీఎండి ప్రభాకర్.. ఈరోజు సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖ (Electricity Department)పై రివ్యూకు సంబంధించి నాకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. విద్యుత్ శాఖ నుంచి కానీ, సీఎంవో నుంచి కానీ.. నాకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటాను అని ప్రశ్నించారు.
మరోవైపు విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి పై తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.. అదీగాక ప్రభాకర్ రావు ఇంట్లోనే ఉండి సమీక్షకు రాకపోవడంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. దీనికి తోడు సమీక్షకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ప్రభాకర్ రావు చెప్పడం చూస్తే.. విద్యుత్ శాఖ అవినీతి పై పలు అనుమానాలు కలుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభాకర్ రావును పిలిచి నిజాలు బయటకు లాగుతారా? 85 వేల కోట్ల నష్టం నిజమని నిరూపిస్తారా? అనేదానిపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది.