అనుకున్నదే అయింది. మెదక్ (Medak) కాంగ్రెస్ లో మైనంపల్లి చిచ్చు పెట్టారు. ఎప్పటినుంచో అక్కడి నియోజకవర్గంలో పని చేస్తున్న కంఠారెడ్డి తిరుపతి రెడ్డి (Tirupati Reddy) కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmatarao) మెదక్ టికెట్ ను తన కుమారుడి కోసం రిజర్వ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నానని.. అయినా, గుర్తింపు లేదని మనస్థాపం చెందారు. డబ్బులు ఉంటేనే టికెట్లు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ (Congress) వ్యతిరేకులకు సీట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారిని విస్మరిస్తున్నారని ఆందోళన చెందారు. ఈ సందర్భంగా లేఖ విడుదల చేసిన ఆయన.. కాంగ్రెస్ లో డబ్బు సంచులు ఉన్న నాయకులకే సీట్లు దక్కే పరిస్థితి ఉందని ఆరోపించారు.
ఏఐసీసీ అధ్యక్షుడితో పాటు సోనియా, రాహుల్ గాంధీ సైతం మౌనం వహించడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి రెడ్డి. ఈమధ్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు మైనంపల్లి హన్మంతరావు. తనకు రెండు సీట్లు కావాలని పట్టుబట్టి జాయిన్ అయ్యారు. ఆ రెండు సీట్లలో మెదక్ స్థానం కూడా ఉంది. అక్కడి నుంచి తన కుమారుడిని దింపాలని చూస్తున్నారు మైనంపల్లి. ఈ విషయంలోనే చెడి బీఆర్ఎస్ తో ఆయన తెగదెంపులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తనకు మెదక్ సీటు ఇవ్వరని గమనించిన తిరుపతి రెడ్డి ఆ పార్టీని వీడుతూ రాజీనామా ప్రకటించారు.
2018 ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం 9 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు. కానీ, అధిష్టానం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తమ్ముడు ఉపేందర్ రెడ్డికి బీ ఫాం ఇచ్చింది. ఈసారి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకొన్నారు. శశిధర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మ్యాడం బాలకృష్ణ, సుప్రభాత్ రావు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ఇదివరకటి మాదిరిగానే వారెవరినీ కాదని మైనంపల్లి రోహిత్ కే టికెట్ ఇస్తున్నారు.