కుంభమేళ తరువాత దేశంలో జరిగే అతి పెద్ద జాతర ఏదయినా ఉందంటే… అది తెలంగాణ (Telangana)లో జరిగే మేడారం (Medaram) సమ్మక్క (Sammakka), సారలమ్మ (Saralamma) జాతరే. ప్రతి రెండేళ్లకోసారి మాఘమాసంలో వచ్చే ఈ జాతర నాలుగురోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ గిరిజనుల జాతరకు హాజరై… మొక్కులు చెల్లించుకొంటే సర్వ శుభాలూ కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు..
ఇక ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను చూసి తరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు దాదాపు కోటిమంది వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహాజాతర ఏర్పాట్లను ప్రభుత్వం రూ.105 కోట్లతో చేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) సుమారుగా ఏకకాలంలో 51 కేంద్రాల నుంచి ఆరు వేలకు పైగా బస్సులను నడిపేందుకు కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని, గత జాతరలతో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నడిచే ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో సుమారు 40 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు మగవారికి, ప్రూఫ్స్ లేని వారికి, రాష్ట్రానికి సంబంధం లేని మిగతా వారికి ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఛార్జీలను నిర్ణయించింది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు 2,500 బస్సులు నడపడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ జిల్లాలోని 22 ప్రాంతాల నుంచి బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ చెల్లించిన వారి కోసం ప్రత్యేక మేడారం బస్సులు ప్రారంభించారు.