మేడ్చల్ (Medchal) పట్టణంలో నేడు ఉమ్మడి కాంగ్రెస్ (Congress) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి (Malkajigiri) పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి (Patnam Sunita Mahender Reddy), మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (Sudhir Reddy), మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ జంగయ్య యాదవ్ హాజరయ్యారు.
ఈ భేటీలో కీలక విషయాల గురించి చర్చనడుస్తుండగా.. పార్టీలో బీఆర్ఎస్ (BRS) నేతలు చేరికపై వివాదం తలెత్తింది. మరోవైపు మేడ్చల్ కి చెందిన పదిమంది మున్సిపల్ కౌన్సిలర్ లు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే. ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణం.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో పార్టీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ముప్పతిప్పలు పెట్టినట్లు తెలిపిన ఆయన.. వారు కడుతున్న బిల్డింగ్ ల వద్దకు వచ్చి అక్రమంగా లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపించారు.. అంత కఠినంగా ప్రవర్తించిన కౌన్సిలర్లను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
ఎన్నో ఏళ్లుగా పార్టీ నమ్ముకొని సేవ చేస్తున్న వారిని కాదని కొత్తగా చేరిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని సూచించారు.. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం గత 10 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడ్డామని, బీఆర్ఎస్ హయాంలో కేసులు సైతం ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సుధీర్ రెడ్డి జోక్యం చేసుకొని తర్వాత మాట్లాడమని గొడవను తాత్కాలికంగా సద్దుమణిగేలా చేశారు.. అయినా లోకల్ క్యాడర్ లో అసంతృప్తిని మాత్రం తగ్గించలేక పోయారు..