మాజీ మంత్రి, మేడ్చల్ (Medchal) ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy) ఇంజినీరింగ్ కాలేజ్(Engineering College)లో ఉద్రిక్తత చోటు చేసుకొంది. లక్షలకు లక్షలు ఫీజు తీసుకొనే ప్రైవేట్ కళాశాలో స్టూడెంట్స్ కు వడ్డించే అన్నంలో పురుగులు రావడం కలకలం సృష్టించింది. హైదరాబాద్ (Hyderabad) శివారు గండి మైసమ్మలో ఉన్న MREC క్యాంపస్ లో గత రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు.
రాత్రి డిన్నర్ సమయంలో తీసుకొనే అన్నం, స్వీట్ లో పురుగులు వచ్చాయని ఆరోపించిన విద్యార్థులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్ లో నిరసన చేపట్టారు. క్వాలిటీ ఫుట్ పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. వీ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు. అయితే గతంలో కూడా తమకు అందిస్తున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే..
ఆ సమయంలో స్వయంగా కళాశాల చైర్మన్ మల్లారెడ్డి ఇకపై భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనితో విద్యార్థులు తమ నిరసన విరమించుకున్నారు. కానీ మరోసారి ఇదే సమస్య ఉత్పన్నం అవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి వచ్చేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది.
ఇక విద్యార్థులకు అందించే భోజనం విషయంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడుతున్న విద్యార్థులు.. తల్లిదండ్రులకు దూరంగా లక్షల కొద్ది ఫీజులు ధారపోసి ఉంటున్న తమ ఆరోగ్యాలతో కాలేజీ యాజమాన్యం ఆడుకోవడం దారుణమని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి తమ విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నారు..
మరోవైపు ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లోని విద్యార్థులు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని ఆందోళన చేపట్టడం నిజంగా సిగ్గుచేటనే విమర్శలు వినిపిస్తున్నాయి.. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించే విద్యార్థుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ప్రభుత్వ హాస్టళ్లల్లో ఉండే విద్యార్థులకు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు..