మేడ్చల్ (Medical ) ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy) ఆయన రూటే సపరేటు అంటారు. ఆయన గురించి తెలిసినవారు.. ఎప్పుడు ఏం మాట్లాడతారో, దేనిపై ఎలా స్పందిస్తారో తెలియదు.. కానీ ఆయన మాటలు మాత్రం నవ్వుకొన్న వారికి నవ్వుకొన్నంతగా ఉంటాయని అంటారు.. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, ఆ శాఖపై ఎప్పుడు మాట్లాడలేదనే ఆరోపణలను సైతం సీరియస్ గా తీసుకొన్న దాఖలాలు లేవంటారు..
అయితే మ్యానరిజంతో ప్రత్యేకంగా ఫాలోవర్లను సంపాదించుకొన్న మల్లన్న మరోసారి వార్తల్లో నిలిచారు. ఎంపీ టికెట్ పై తన మనసులో మాట బయట పెట్టారు. పార్టీ ఆదేశిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని, తాను పోటీ చెయ్యాలా ? వద్దా ? అనేది పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఈ నెల 21న జరిగే పార్లమెంట్ స్థాయి సమావేశంలో తన అభ్యర్ధిత్వంపై అధిష్టానం నిర్ణయిస్తుందని.. మీడియా ముఖంగా పేర్కొనడం రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.
అయితే లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో మల్లారెడ్డి వ్యాఖ్యలపై, బీఆర్ఎస్ అధిష్టానం స్పందన ఏంటీ అనేది కీలకంగా మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ఏమీ చేయలేదని, అభివృద్ధి అంటే కేసీఆర్, కేటీఆర్ మాత్రమే అని మల్లన్న నోటి వెంట రావడం చర్చాంశనీయంగా మారింది. ఆయన నిజంగానే పోటీ చేస్తారా? లేక పార్టీలో కలవరం సృష్టించేందుకే ఈ తరహ వ్యాఖ్యలు చేశారా? అని పార్టీ వర్గాలలో టాక్ మొదలైనట్టు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురవడంతో మల్లారెడ్డి మంత్రి పదవి పోయింది. దీంతో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గోవాలో ఎంజాయ్ చేస్తూ కనిపించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక రాష్ట్రంలో కారు గ్యారేజికే పరిమితం అవుతోందనే వార్తలు ప్రచారం జరుగుతోన్న క్రమంలో ఎమ్మెల్యేగా ఎవరు పట్టించుకోరు.. కనీసం కేంద్రంలో ఎంపీగా ఉంటే కాస్త మర్యాద దక్కుతోందనే ఆలోచనతో అలా మాట్లాడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అనుకొంటున్నారు..