పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కేసు (Medico Preeti Case) మరోసారి తెరపైకి వచ్చింది. వరంగల్ (Warangal) కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ధరావత్ ప్రీతి గతేడాది ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆత్మహత్య కేసు విచారణలో యాంటీ ర్యాగింగ్ (Anti Ragging Committee) కమిటీ నిన్న పునఃవిచారణ జరిపి సైఫ్ సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించింది.
మరోవైపు తాను రిమాండ్ లో ఉన్న సమయంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ తనను విచారించకుండానే తీర్మానం చేసినట్లు ఆరోపణలు చేసిన సైఫ్ అలీ.. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపారు.. ఈ క్రమంలో న్యాయమూర్తి నిందితుడిని సైతం విచారించి తీర్మానం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పునఃవిచారణ చేపట్టారు. ప్రీతిని వేధించాడని సెకండియర్ అనస్థీషియా విద్యార్థి సైఫ్ అలీపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని నమ్మిన కమిటీ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సస్పెన్షన్ సరైనదిగా పేర్కొంది.
దాంతో పాటుగా కోర్టు ఉత్తర్వుల అనంతరం విచారణకు హాజరుకాకుండా విధులకు హాజరైన 97 రోజుల కాలాన్ని సైతం కలుపుకొని 2024 జూన్ 8వ తేదీ వరకు సస్పెన్షన్ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు, కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో కమిటీ విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించవచ్చని కోర్టు తెలిపింది.
గతేడాది 2023 ఫిబ్రవరి 22న, ఎంజీఎం ఆస్పత్రిలో, ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పాయిజన్ ఇంజక్షన్ వేసుకొని, నిమ్స్ లో చికిత్స పొందుతూ అదే నెల 26న మృతి చెందింది. ప్రీతి ఆత్మహత్య ఘటన సంచలనంగా మారి దుమారం సృష్టించడంతో.. పోలీసులు సైఫ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఏడాది పాటు తరగతులకు హాజరుకాకుండా కేఎంసీ ర్యాగింగ్ నిరోధక కమిటీ నిర్ణయం తీసుకొంది.