తెలంగాణ (Telangana)లో కేసీఆర్ (KCR) సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ బలం లేని వాదనలని గులాబీ నేతలు వాదించారు.. అయితే ఆ పార్టీ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. కాళేశ్వరం మ్యాటర్ రోజు వార్తల్లో నిలుస్తోంది.. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ ( Medigadda Barrage) కుంగుబాటు అంశం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
మేడిగడ్డలోని ఏడో బ్లాకులో 20వ పియర్‌తో పాటు 19, 21 పియర్స్ కుంగాయి. ముఖ్యంగా ఆరో బ్లాకులోని పలు పియర్స్‌పై ఉన్న ఇనుప దిమ్మెలు కదిలిపోయాయి. ఇనుప దిమ్మెలను అనుసంధానం చేసేందుకు వేసిన జాయింట్లు కూడా చాలా చోట్ల విరిగిపోయాయి. నిశితంగా పరిశీలిస్తే ఆరో బ్లాకుపై పలు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. 19, 20, 21 పియర్స్‌పై ఉండే ఇనుప బీమ్‌లు కిందికి దిగడంతో వాటి మధ్య ఉండే జాయింట్లు పగిలిపోయాయని , 2, 23, 24 పియర్స్‌పైన ఉన్న బీమ్ల జాయింట్లు కూడా పగుళ్లు వచ్చి ఒరిగిపోయాయని వెల్లడించారు.
మరోవైపు ఏడో బ్లాకు ఒక్కటే కాకుండా సమీప బ్లాకుల్లో వచ్చిన మార్పులను సైతం నిశితంగా పరిశీలించాల్సిందేనని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇదివరకే పియర్స్ కుంగడంతో మూడు క్రెస్టు గేట్లను మార్చాల్సి వస్తుందని ఈఎన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. గేట్ల నిర్వహణకు ఏర్పాటు చేసిన వించ్, యాక్సెస్ లాడర్, వాక్ వే- 1, వాక్ వే-2, గేట్లను తెరిచేందుకు, మూసేందుకు ఉపయోగించే ప్రత్యేక పరికరం నడిచే గాంట్రీ వాక్ గిర్డర్ బీమ్‌లను పూర్తిగా మార్చనున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మంత్రులు.. బ్యారేజీ ఏడో బ్లాకు సమీపంలో లీకేజీ ఉందని, చర్యలు చేపట్టాలని నిర్మాణ సంస్థకు 2022 ఏప్రిల్ 28న లేఖ రాసినప్పుడే ఎందుకు స్పందించి చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు.. మూడో టీఎంసీ తరలింపునకు మొదట భూగర్భ సొరంగం నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, తర్వాత పైపులైనుకు మార్చారని మంత్రులు తెలిపారు. నిర్మాణానికి సమయం సరిపోదనే మార్చినట్లు దస్త్రాల్లో చూపారని, రెండు టీఎంసీల పనులే పూర్తికానప్పుడు మూడో టీఎంసీ నిర్మాణాలకు అంత తొందర ఏం వచ్చిందని మంత్రులు మండిపడ్డారు..