Telugu News » Kishan Reddy : . కాంగ్రెస్ అమ్ముకునే పార్టీ.. బీఆర్ఎస్ కొనుక్కునే పార్టీ..!

Kishan Reddy : . కాంగ్రెస్ అమ్ముకునే పార్టీ.. బీఆర్ఎస్ కొనుక్కునే పార్టీ..!

ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని కిషన్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్‌ పాలన సాగుతోందని అన్నారు. కేసీఆర్‌ నియంతలా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు.

by admin
Meet the Press With T BJP Chief Kishan Reddy

– కేసీఆర్ కాంగ్రెస్ ప్రొడక్ట్
– కొడుకు కోసం పాత సెక్రటేరియట్ కూల్చారు
– హుజూరాబాద్ ఫలితాలే రిపీట్ అవుతాయి
– అన్ని వర్గాలను సీఎం మోసం చేశారు
– కామారెడ్డి, గజ్వేల్‌ లో కేసీఆర్‌ ఓటమి తప్పదు
– మీట్ ది ప్రెస్ లో కిషన్ రెడ్డి విమర్శల దాడి

సీఎం కేసీఆర్‌ (CM KCR) కామారెడ్డి, గజ్వేల్‌ లో ఓటమి పాలవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌ (Hyderabad) ప్రెస్‌ క్లబ్‌ లో మీట్‌ ది ప్రెస్‌ లో పాల్గొన్న ఆయన.. డబ్బుతో అభ్యర్థులు, నాయకులను కొనవచ్చు కాని, ప్రజల కోపాన్ని తగ్గించలేరని అన్నారు. హుజూరాబాద్‌ (Huzurabad) ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితమే తెలంగాణ వ్యాప్తంగా రాబోతోందని జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ యువత సునామీలా విజృంభించి బీఆర్‌ఎస్‌ (BRS) ను తుడిచిపెడుతుందని అన్నారు.

Meet the Press With T BJP Chief Kishan Reddy

రాష్ట్రంలో సీఎం, మంత్రులను కలిసే వీలు లేకుండా పోయిందన్న కిషన్ రెడ్డి.. దళితుడిని సీఎం చేస్తానని.. కేసీఆర్ మాట తప్పారని.. ఉద్యోగ నియామకాల్లో విఫలమయ్యారని విమర్శలు చేశారు. కేసీఆర్ రోడ్ల గురించి మాట్లాడుతున్నారని.. కేంద్రం నిధులివ్వకుంటే వేసే వారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం కీలకంగా వ్యవహరించిందన్న ఆయన.. ఈ ఎన్నికల్లో జనసేన (Janasena) తో కలిసి పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణకు బీసీ నేతను ముఖ్యమంత్రిని చేయటమే బీజేపీ (BJP) లక్ష్యమని చెప్పారు.

ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని కిషన్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్‌ పాలన సాగుతోందని అన్నారు. కేసీఆర్‌ నియంతలా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారని, పదేళ్లుగా ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఉద్యోగ భర్తీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శల దాడి చేశారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే అని అన్నారు. రుణమాఫీతో 30 శాతం మంది రైతులకు కూడా లాభం జరగలేదన్న ఆయన.. ఉస్మానియా ఆస్పత్రికి తాళాలు వేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

టీఎస్పీఎస్సీ విఫలమైందని, 17 పరీక్షలు వాయిదా పడ్డాయని తెలిపారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే కడుపు తరుక్కుపోతోందని.. మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్న 10 టీఎంసీల వాటర్ ఖాళీ చేశారని అన్నారు. భద్రాచలం సీతారామ కళ్యాణానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కనీసం వెళ్ళడం లేదన్నారు. మనవడిని భద్రాచలం పంపడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. ఎన్నికల వ్యవస్థను కేసీఆర్ చిధ్రం చేశారని ఆరోపించారు. కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌ తోనే ప్రారంభించారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కు పూర్తి అవగాహన ఉందని, 2004లో కాంగ్రెస్‌ తో టీఆర్ఎస్ ప్రభుత్వం కలసి పనిచేసిందని వివరించారు. ‘కాంగ్రెస్ అమ్ముకునే పార్టీ.. బీఆర్ఎస్ కొనుక్కునే పార్టీ’ అని ఎద్దేవ చేశారు. బీజేపీకి బీఆర్ఎస్‌ తో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

వాస్తు పేరుతో పాత సెక్రటేరియట్ ను కూల్చేసిన కేసీఆర్.. కొత్త సచివాలయానికి ఎదుకు రావడం లేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో 53 శాతం ఉన్న బీసీలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించిందని.. రాహుల్ గాంధీ, కేటీఆర్ బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తామని తెలిపారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఉద్యమాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 1200 మంది బలిదానాలకు బాధ్యులెవరని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

You may also like

Leave a Comment