ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈనెల 5న ఈడీ(ED) బృందంపై జరిగిన దాడికి సంబంధించి తమకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ(Central Home Ministry) పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. దర్యాప్తు సంస్థలపై దాడులను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని ఆదేశించింది.
ఈనెల 5న సందేశ్‌ఖాలిలో టీఎంసీ(TMC) నేత షాజహాన్ షేక్(Shajahan Shek) ఇంట్లో సోదాల కోసం వెళ్లిన ఈడీ బృందంపై ఆయన అనుచరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులు గాయపడ్డారు. వారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాలెట్లు దోపిడీకి గురయ్యాయి. ఈ క్రమంలో షాజహాన్ పరారయ్యారు.
ఆయన కోసం ఈడీ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం నుంచి జారుకోకుండా చూడాలని సంబంధిత వర్గాలకు సూచించింది. కాగా, ఈ నెల 5న మరో ఈడీ బృందంపై దాడి జరిగింది. బాంగావ్‌లో టీఎంసీ నేత శంకర్ ఆధ్యా అరెస్టు సందర్భంగా ఈడీ టీమ్‌పై దాడికి తెగబడ్డారు. వారి వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక పంపాలని కేంద్రం కోరింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈడీపై దాడి నేపథ్యంలో ఆ సంస్థ ఇన్చార్జి డైరెక్టర్ రాహుల్ నవీన్ సోమవారం అర్ధరాత్రి కోల్‌కతా చేరుకున్నారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌తో ఆయన సమావేశం కానున్నారు.