మిచాంగ్ తుపాను(Michaung Cylclone) ప్రభావం ఏపీ(AP)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లగా రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు చేతికొచ్చే సమయానికి తుపాను తీరని నష్టాన్ని మిగిలిస్తోంది. తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్(CM Jagan) ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడంలేదు.
ముఖ్యంగా ఉద్యాన, కూరగాయల పంటలకు తుపాను ప్రభావంతో తీరని నష్టం వాటిల్లుతోంది. మిరప, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటల నష్టం రూ.7వేల కోట్ల పైనే ఉంటుందని అంచనా. వందలాది గ్రామాలకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. అమరావతి-విజయవాడ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
కాకినాడ జిల్లా తుని, కోటనందూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. బొండుగడ్డ వాగు, అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేట వద్ద కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. దేవిపట్నం మండలం ఉప్పాయపాలెం వద్ద వరిచేలు నేలకొరిగాయి.
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు సమీపంలోని వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. 50గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బొక్కెల్లు రాయగడ్డ సమీపంలోని వంతెనపై వరద ప్రవహిస్తోండడంతో సుమారు 20గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు అంతరాయం ఏర్పడింది.
అనకాపల్లి జిల్లా వడ్డాది వద్ద పెద్దేరుపై ఉన్న కాజ్‌వేపై నుంచి వరద ప్రవాహానికి ఎలమంచిలిలో జగనన్న కాలనీ ముంపునకు గురైంది. ఏటికొప్పాక వద్ద వరాహనది ఉధృతి పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వాగులు పొంగుతున్నాయి. కట్లేరు, పడమటి, ఎదురుళ్ల విప్ల, గుర్రపు, తెలంగాణ నుంచి వస్తున్న నీటితో వరద మరిత పెరిగింది.
తుపాను ప్రభావంతో విజయవాడ డివిజన్‌లో తిరుపతి, నెల్లూరు, చెన్నై మధ్య అధికారులు 13 రైళ్లను రద్దు చేశారు. అదేవిధంగా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తుపాను ప్రభావంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి 20 దేశీయ విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.